రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి మరో కీలక అడుగు వేసింది. గిరిజన గ్రామాల జీవనవిధానాన్ని మెరుగుపరచడం అక్కడి ప్రజలకు అవసరమైన సౌకర్యాలు అందించడం లక్ష్యంగా ధర్తి ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్’ పేరుతో అమలు చేస్తున్న పథకానికి అదనపు నిధులను విడుదల చేసింది. ఈ పథకం కింద మొత్తం రూ.41.15 కోట్ల అదనపు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం రెండు ప్రత్యేక జీవోలను జారీ చేసింది.
ఈ నిధులను పూర్తిగా గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి వినియోగించాలనే దిశగా స్పష్టమైన ఆదేశాలను ప్రభుత్వం సంబంధిత శాఖలకు అందించింది. రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్య, ఆరోగ్య సేవలు, గ్రామీణ మౌలిక వసతుల వంటి ముఖ్య రంగాల్లో కార్యక్రమాలు చేపట్టాలని గిరిజన సంక్షేమశాఖ పేర్కొంది. గిరిజన గ్రామాల ప్రజల ఆర్థిక పురోగతికి ఈ నిధులు ఉపయోగపడేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని గిరిజన సంక్షేమ డైరెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఉత్తర్వులకు గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి ఎం.ఎం. నాయక్ సంతకం చేశారు.
ఇక విద్యా రంగానికి సంబంధించి మరో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, గిరిజన మరియు ఇతర వెనుకబడిన ప్రాంతాల్లో విద్యార్థుల కోసం నిర్మిస్తున్న హాస్టళ్ల పనులను వేగవంతం చేసేందుకు రూ.2.75 కోట్ల అదనపు నిధులు మంజూరు చేసింది. పలు ప్రాంతాల్లో హాస్టల్ భవనాలు నిర్మాణ దశలో ఉండటంతో, పనులు ఆలస్యం కాకుండా, సౌకర్యాలు త్వరగా అందుబాటులోకి రావడానికి ఈ నిధులు ఉపయోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
హాస్టళ్ల నిర్మాణం, మరమ్మతులు, భవనాల పూర్తిచేయడం వంటి పనులను వెంటనే ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. అవసరమైన సాంకేతిక చర్యలు, ప్రణాళికలు, పర్యవేక్షణ కోసం సమగ్ర శిక్షణ పథకం పీడీ కూడా చురుకుగా వ్యవహరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ సంతకం చేశారు.
గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం వరుసగా తీసుకుంటున్న ఈ చర్యలు, అక్కడి ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరుస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పల్లెపల్లెల్లో తాగునీటి సదుపాయాలు, విద్యార్థులకు వసతి సౌకర్యాలు, ఆరోగ్య సేవలు సులభంగా అందుబాటులోకి రావడం వల్ల గిరిజన కుటుంబాలు పెద్ద ఎత్తున ప్రయోజనం పొందనున్నాయి. అదనపు నిధుల విడుదలతో పథకాల అమలు వేగం పెరగనున్నది మాత్రమే కాకుండా, నిలిచిపోయిన పనులకు ఊపిరిపొసుకునే అవకాశం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.