- ఎన్నికల విజయంలో ఎన్నార్టీలు, జనసేన, బీజేపీల పాత్ర కీలకమని వెల్లడి..
- తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం భావోద్వేగ ప్రసంగం..
- రూ. 22 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రణాళిక – విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఏపీ..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన దావోస్ పర్యటనను అత్యంత ఉత్సాహంగా ప్రారంభించారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో ఏర్పాటు చేసిన 'తెలుగు డయాస్పోరా' సమావేశంలో ఆయన పాల్గొని, సుమారు 20 దేశాల నుంచి వచ్చిన ప్రవాస తెలుగువారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న విషయాలు కేవలం రాజకీయాలు మాత్రమే కాదు, రాబోయే తరానికి ఆయన ఇస్తున్న భరోసాగా నిలిచాయి.
జ్యూరిచ్‌లో జరిగిన ఈ వేడుకలో ముఖ్యమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు మరియు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన సిద్ధం చేసిన రోడ్ మ్యాప్ వివరాలు మీకోసం. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికంగా, ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' (Speed of Doing Business) విధానాన్ని అమలు చేసి, రాష్ట్రానికి ఉన్న పాత బ్రాండ్ ఇమేజ్‌ను తిరిగి తీసుకువచ్చామని చెప్పారు.ఇప్పటికే ఆర్సెలర్ మిట్టల్ సంస్థ రూ. 1 లక్ష కోట్లతో ఉక్కు పరిశ్రమను, ఏఎం గ్రీన్ సంస్థ సుమారు రూ. 90 వేల కోట్లతో గ్రీన్ అమోనియా ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయని వెల్లడించారు.
20 లక్షల ఉద్యోగాలు.. రూ. 22 లక్షల కోట్ల లక్ష్యం!
రాష్ట్ర భవిష్యత్తుపై చంద్రబాబు తన స్వప్నాన్ని వివరించారు. రాబోయే ఐదేళ్లలో ఏపీకి రూ. 22 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకురావడం ద్వారా 20 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. దేశంలోకి వచ్చిన అతిపెద్ద ఐటీ పెట్టుబడి 'గూగుల్' రూపంలో ఆంధ్రప్రదేశ్‌కే రావడం మన రాష్ట్రంపై పారిశ్రామికవేత్తలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించడంలో ఎన్నార్టీలు (Non-Resident Telugus) పోషించిన పాత్రను సీఎం కొనియాడారు. రాష్ట్రం బాగుపడాలనే తపనతో కొందరు ఎన్నార్టీలు క్షేత్రస్థాయిలోకి వచ్చి పనిచేశారని, ఆ క్రమంలో కేసులు కూడా ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ప్రజల ఆశీస్సులు, ఎన్నార్టీల సహకారంతో 93 శాతం సక్సెస్ రేటుతో చారిత్రాత్మక విజయం సాధించామని ధన్యవాదాలు తెలిపారు.
"లైచెన్ స్టెయిన్ లాంటి చిన్న దేశం టెక్నాలజీతోనే ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా మారింది" అని చెబుతూ టెక్నాలజీ ప్రాధాన్యతను వివరించారు. ఏపీ ప్రభుత్వం ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), స్పేస్ టెక్నాలజీ మరియు డ్రోన్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటోందని చెప్పారు. డ్రోన్ ఆపరేషన్లకు అనుమతులు వేగంగా వచ్చేలా చూడాల్సిన బాధ్యతను కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తీసుకోవాలని సూచించారు.
"పదవులు వస్తే కేవలం గ్లామర్ మాత్రమే ఉండదు, రాళ్లు కూడా పడతాయి.. వాటిని తట్టుకుని నిలబడటమే యువత నేర్చుకోవాలి" అని లోకేశ్, రామ్మోహన్‌నాయుడు వంటి యువ నాయకులను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఒకరికొకరు తోడుగా ఉంటూ అత్యంత ప్రభావవంతమైన కమ్యూనిటీగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.