నీటిపై తేలుతున్నట్లుగా కనిపించే ఒక గ్రామం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలతో ఈ గ్రామం పేరు అందరి నోటా వినిపిస్తోంది. తొలిచూపులో ఇది నిజంగానే నీటిమీద నిర్మించిన గ్రామంలా అనిపిస్తుంది. కాలువల మధ్య ఇళ్లు, నీటి దారులపై నడిచే పడవలు, నీటిని దాటుకుంటూ వెళ్లే రహదారులు చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ అద్భుతమైన దృశ్యాలు చూసిన వారు ఇది మనుషుల సృష్టేనా లేక ప్రకృతి చేసిన అద్భుతమా అనే భావనలో పడిపోతున్నారు.
ఈ ప్రత్యేక గ్రామం మరెక్కడో కాదు కేరళలో ఉంది. ఎర్నాకులం జిల్లాలో, కొచ్చి నగరానికి సమీపంలో ఉన్న కడమకుడి అనే గ్రామం ప్రస్తుతం పర్యాటకుల ఆకర్షణగా మారింది. ఇది మొత్తం 14 చిన్న దీవుల సమాహారంగా ఉండటం విశేషం. ఈ దీవులను చుట్టుముట్టిన బ్యాక్‌వాటర్స్, కాలువలే ఈ గ్రామానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. డ్రోన్ కెమెరాలతో తీసిన వీడియోల్లో గ్రామం మొత్తం నీటితో కప్పబడి ఉన్నట్లుగా కనిపించడంతో, దీనిని భారతదేశంలో నీటిపై నిర్మించిన అరుదైన గ్రామంగా చెబుతున్నారు.
కడమకుడి గ్రామంలో రోడ్లు, కాలువలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు రహదారులపై ప్రయాణిస్తే, మరికొన్ని చోట్ల పడవలే ప్రధాన రవాణా సాధనంగా మారాయి. ఇళ్ల ముందు నుంచే నీటి కాలువలు ప్రవహిస్తూ ఉండటం అక్కడి జీవన విధానాన్ని ప్రత్యేకంగా చూపిస్తుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో పడవల కదలికలు, నీటిపై పడే సూర్యకాంతి గ్రామానికి మరింత అందాన్ని తెచ్చిపెడతాయి.
పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శించాలంటే రోడ్డు మార్గం, జల మార్గం రెండింటి సౌకర్యం ఉంది. కొచ్చి లేదా ఎడపల్లి నుంచి ఉత్తర పరవూర్ వైపు జాతీయ రహదారి 66 ద్వారా ప్రయాణించి వరపుజ వంతెన దాటితే కడమకుడి దారి కనిపిస్తుంది. దారిలో ఏర్పాటు చేసిన సూచిక బోర్డులు ప్రయాణికులకు సహాయపడతాయి. అలాగే ప్రజా రవాణా ఉపయోగించేవారికి ఎర్నాకులం, విట్టిల ప్రాంతాల నుంచి బస్సు సదుపాయాలు ఉన్నాయి. మరోవైపు ఎర్నాకులం హైకోర్టు జెట్టీ నుంచి పడవలో ప్రయాణించి పిజాల చేరుకుని, అక్కడి నుంచి చిన్న పడవల ద్వారా కడమకుడికి వెళ్లవచ్చు.
కడమకుడి గ్రామం మాత్రమే కాకుండా కేరళలో ఇలాంటి నీటి ప్రాంతాలు మరెన్నో ఉన్నాయి. అలప్పుజ, కుమారకోమ్, కుట్టనాడ్, కొల్లం, కొట్టాయం వంటి ప్రాంతాలు బ్యాక్‌వాటర్స్ అందాలకు ప్రసిద్ధి చెందాయి. అయితే, నీటిమీద నిర్మించిన గ్రామంగా కడమకుడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి ప్రశాంత వాతావరణం, సహజ సౌందర్యం నగర జీవన ఒత్తిడితో అలసిపోయిన వారికి ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల కారణంగా కడమకుడికి వచ్చే సందర్శకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రకృతి ప్రేమికులు, ఫోటోగ్రాఫర్లు, ట్రావెల్ వ్లాగర్లు ఈ గ్రామాన్ని తమ గమ్యస్థానంగా ఎంచుకుంటున్నారు. ఒక్కసారి ఈ గ్రామాన్ని చూస్తే, జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుందని అక్కడికి వెళ్లిన వారు చెబుతున్నారు. నీరు, మనిషి జీవనం కలిసి ఏర్పడిన ఈ అద్భుత గ్రామం నిజంగా భారతదేశ గర్వకారణంగా నిలుస్తోంది.