ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా శక్తికి, వారి ఆర్థిక స్వావలంబనకు నిదర్శనంగా నిలిచే 'డ్వాక్రా' వ్యవస్థపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తనకున్న మమకారాన్ని మరోసారి చాటుకున్నారు. గుంటూరు (Guntur) లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక 'సరస్ మేళా 2026' (Saras Mela 2026) ను గురువారం ఆయన ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళా పారిశ్రామికవేత్తలు రూపొందించిన ఉత్పత్తులను చూసి ఆయన ముగ్ధులయ్యారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ డ్వాక్రా వ్యవస్థ ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్నారు. "30 ఏళ్ల క్రితం మహిళలు సంఘాల కోసం బయటకు వస్తే ఎగతాళి చేసేవారు. కానీ నేడు అదే మహిళలు దేశానికే ఆదర్శంగా నిలిచి, తిరుగులేని వ్యవస్థగా రికార్డు సృష్టించారు" అని ఆయన కొనియాడారు.
రాష్ట్రంలో కోటీ 13 లక్షల మంది డ్వాక్రా మహిళలు రూ. 26 వేల కోట్ల నిధిని మరియు రూ. 5,200 కోట్ల కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవడం వారి పట్టుదలకు నిదర్శనమని చెప్పారు. ఈ ఏడాదిలోనే రూ. 46,590 కోట్ల బ్యాంకు రుణాలు పొందారంటే వారిపై బ్యాంకులకున్న నమ్మకం అర్థం చేసుకోవచ్చన్నారు.
ఆడబిడ్డలతో టీడీపీకి ప్రత్యేక అనుబంధం
తెలుగుదేశం పార్టీకి ఆడబిడ్డలతో ఉన్నది ప్రత్యేక అనుబంధమని చంద్రబాబు గుర్తుచేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆనాడే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారని, వారి ఉన్నత విద్య కోసం తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించానన్నారు. రాష్ట్రంలో 89 లక్షల మంది డ్వాక్రా, 24 లక్షల మంది మెప్మా సంఘాల సభ్యులున్నారని తెలిపారు.
తాను ఇచ్చిన ఐటీ పిలుపుతో ఎంతోమంది ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని, ఇప్పుడు ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఇప్పటికే 93 వేల మంది సూక్ష్మ, చిన్న తరహా పారిశ్రామికవేత్తలుగా మారారని, డ్వాక్రా మహిళలు విదేశాలకు వెళ్లి శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగారని కొనియాడారు.
సంక్షేమ పథకాలతో భరోసా..?
ముఖ్యమంత్రి అంటే పెత్తందారు కాదని, ప్రజలకు సేవ చేసే సేవకుడని చంద్రబాబు అన్నారు. తమ కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి పనిచేస్తోందని తెలిపారు. 'తల్లికి వందనం' కింద ఏటా రూ.10,090 కోట్లను 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని, 'స్త్రీ శక్తి' పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పారు.
'దీపం' పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామన్నారు. 'సంజీవని' కార్యక్రమంతో రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తామని, పేదరికం లేని సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు.
భారీగా నిధుల విడుదల..?
ఈ కార్యక్రమంలో భాగంగా, స్త్రీ నిధి పథకం కింద డ్వాక్రా సంఘాలకు రూ. 1,375 కోట్ల చెక్కును, సెర్ప్ ద్వారా మరో రూ. 2,171 కోట్ల రుణాలను సీఎం పంపిణీ చేశారు. చేనేత వస్త్రాల స్టాల్స్‌ను సందర్శించిన ఆయన, తన అర్ధాంగి భువనేశ్వరి కోసం ఒక చీరను కొనుగోలు చేశారు. తన భర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఓ మహిళ విన్నవించుకోగా, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తక్షణమే రూ. 6 లక్షలు మంజూరు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.