రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu)మంత్రులతో విస్తృతంగా సమీక్షించారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, భవిష్యత్ అవసరాలు, ప్రజలకు ప్రత్యక్షంగా లాభం చేకూరే అంశాలపై సీఎం స్పష్టమైన ఆలోచనలు వెల్లడించారు. ముఖ్యంగా జలరవాణా, విద్యుత్, వ్యవసాయం, పర్యాటకం, పరిశ్రమలు వంటి కీలక రంగాలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
జలరవాణా రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు వెళ్లవచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జలమార్గాల వినియోగం పెరిగితే రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా, లాజిస్టిక్స్ రంగంలో ప్రపంచస్థాయిలో పోటీపడే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. (AP Cabinet Meeting) ప్రతి తీరప్రాంత జిల్లాలో ఒక పోర్టు ఉండేలా దీర్ఘకాలిక కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. సముద్ర మార్గాలను సమర్థంగా వినియోగిస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలమని సీఎం స్పష్టం చేశారు.
విద్యుత్ రంగంపై కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత పాలనలో విధించిన ట్రూ అప్ ఛార్జీలు AP (Power Tariff Reduction) ప్రజలపై భారం కాకుండా ప్రభుత్వం భరిస్తోందని తెలిపారు. ఇందుకోసం రూ.4,490 కోట్లను ప్రభుత్వం వెచ్చించిందని వెల్లడించారు. యూనిట్ విద్యుత్ ఛార్జీని ఇప్పటికే రూ.5.19 నుంచి రూ.4.90కి తగ్గించామని, మార్చి నాటికి రూ.4.80కి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 2029 నాటికి యూనిట్‌కు రూ.1.19 తగ్గేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. విద్యుత్ ఉత్పత్తిని పెంచడం, ట్రాన్స్‌మిషన్ లాస్ తగ్గించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని సూచించారు.
వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. ఈసారి ధాన్యం సేకరణ రికార్డు స్థాయిలో జరిగిందని, కేవలం ధాన్యం మాత్రమే కాకుండా అన్ని రకాల పంటలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని చెప్పారు. రైతులు ఒక్క పంటకే పరిమితం కాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. నీటి లభ్యత పెరిగితే రైతులు కొత్త పంటలు సాగు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.
సముద్రంలో కలిసే నీటిని సద్వినియోగం చేసుకుంటే తెలుగురాష్ట్రాలకు మేలు జరుగుతుందని అన్నారు. నీరు ఊరకే సముద్రం పాలవడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కృష్ణా జలాలను విశాఖపట్నం వరకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంలో గత పాలనలో జరిగిన తప్పులను ప్రస్తావిస్తూ, ఇప్పుడు వాటికి తమపై నిందలు వేయడం సరికాదని సీఎం వ్యాఖ్యానించారు.
పరిశ్రమల విషయానికి వస్తే, ఫెర్రో ఎల్లాయిస్ యూనిట్లు ఇప్పటికే సుమారు 70 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. మొదటి ఏడాది విద్యుత్ రాయితీలు ఇస్తే, తర్వాత అవే యూనిట్లు స్వయం సమృద్ధిగా ఉత్పత్తి చేసుకుంటాయని అభిప్రాయపడ్డారు.
పర్యాటక రంగాన్ని సీఎం గేమ్ ఛేంజర్‌గా అభివర్ణించారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను పూర్తిగా వినియోగించుకుంటే (Tourism Development AP) పర్యాటకం ద్వారా భారీ ఆదాయం, ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. చీరాల పట్టణం ఇప్పటికే టూరిజం హబ్‌గా మారుతోందని, అక్కడ పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రులకు సూచించారు. మొత్తంగా అధికారుల సమన్వయంతో ప్రతి ప్రాజెక్టు భూమిపై కనిపించేలా పనిచేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.