ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించనుంది. ‘స్త్రీ శక్తి’ అనే పేరుతో అమలయ్యే ఈ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని 8,456 బస్సుల్లో ఈ పథకం అమలు చేయనున్నారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ బస్సులు ఇలా అన్ని ముఖ్యమైన సర్వీసుల్లో ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇతర రాష్ట్రాలకంటే మెరుగ్గా ఈ పథకాన్ని అమలు చేస్తామన్నది ప్రభుత్వ లక్ష్యం.
ఈ పథకం ద్వారా ఒక కుటుంబానికి నెలకు సుమారుగా రూ.800 వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. మహిళల ప్రయాణ భారం తగ్గించడమే కాదు, వారి ఆర్థిక భద్రతకు ఇది తోడ్పడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు అమలులో ఉన్నా, ఆంధ్రప్రదేశ్‌లో మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తోంది.
ఇక పరిశ్రమల రంగంలోనూ రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా నిర్ణయాలు తీసుకుంది. ఫార్చ్యూన్-500, ఫోర్బ్స్ జాబితాలో ఉన్న ప్రముఖ సంస్థలను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నామని మంత్రి పార్థసారథి తెలిపారు. ఈ సంస్థలు కనీసం 3 వేలమందికి ఉద్యోగాలు కల్పించాలి. అలాగే జీసీసీ విభాగంలో రెండువేల మందికి ఉపాధి కల్పించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఒప్పందం కుదిరిన ఆరు నెలల్లో సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది.
పర్యాటక రంగ అభివృద్ధికీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. అరకు, భవానీ ఐలాండ్స్ వంటి ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో రిసార్టులు, స్టార్ హోటళ్లు నిర్మించేందుకు ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వైష్ణవి ఇన్‌ఫ్రా సంస్థకు 25 ఎకరాల టీటీడీ భూమిని కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇక విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రూ.900 కోట్ల ఏపీబీడీసీఎల్ రుణాలకు ప్రభుత్వ హామీ ఇచ్చింది. మత్స్యకారులు, నాయీబ్రాహ్మణుల గౌరవ వేతనాలను పెంచడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40,000 హెయిర్‌కటింగ్ షాపులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించనున్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
విద్యారంగంలో గత ప్రభుత్వ వైఖరి వల్ల ఎదురైన ఇబ్బందులను పరిష్కరించేందుకు ఇప్పటి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రాథమిక తరగతుల విద్యార్థులను దూర ప్రాంతాల హైస్కూళ్లకు కలిపి ఇబ్బందులు కలిగించిన వ్యవహారాన్ని సవరించి, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మొత్తంగా, మహిళలు, విద్యార్థులు, పరిశ్రమలు, పర్యాటక రంగం, బీసీ వర్గాలు ఇలా అన్ని విభాగాల అభివృద్ధికి కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోవడం విశేషం. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడమే కాకుండా, అభివృద్ధి లక్ష్యంతో ముందడుగు వేస్తోంది.