ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా మరో కీలక అడుగు వేసింది. ‘చాయ్‌రస్తా’ ఫ్రాంచైజ్ యూనిట్లను రాష్ట్రంలోని పలు పట్టణాల్లో ఏర్పాటు చేస్తూ, తక్కువ పెట్టుబడితో మహిళలు స్వయం ఉపాధి పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ కార్యక్రమాన్ని మెప్మా (MEPMA) ఆధ్వర్యంలో అమలు చేస్తున్నారు.
ప్రస్తుతం విజయనగరం, రాజాం, బొబ్బిలి, నెల్లిమర్ల పట్టణాల్లో చాయ్‌రస్తా యూనిట్ల ఏర్పాటుకు మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ యూనిట్లలో నాణ్యమైన టీ, కాఫీతో పాటు బూస్ట్, బోర్నవిటా, హార్లిక్స్ వంటి పానీయాలను తక్కువ ధరకే అందించనున్నారు. ఒక్కో కప్పు ధర రూ.20 నుంచి రూ.30 మధ్య ఉండేలా నిర్ణయించారు.
చాయ్‌రస్తా యూనిట్ ఏర్పాటు కోసం సుమారు రూ.6.60 లక్షల పెట్టుబడి అవసరం కాగా, ముడి సరుకుల కోసం అదనంగా రూ.50 వేలు కేటాయించాల్సి ఉంటుంది. ఈ పెట్టుబడిలో కొంత భాగాన్ని బ్యాంకు రుణాల ద్వారా ప్రభుత్వం సాయం చేస్తుంది. గ్యాస్ అవసరం లేకుండా పనిచేసే ఆధునిక యంత్రాలతో టీ, కాఫీ తయారీ సులభంగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ యూనిట్ల నిర్వహణ కోసం మహిళలకు ప్రభుత్వం పూర్తి శిక్షణ అందిస్తుంది. గుంటూరు, విజయవాడల్లో మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శిక్షణ పూర్తైన తర్వాత నలుగురు మహిళలు కలిసి ఒక చాయ్‌రస్తా అవుట్‌లెట్‌ను నిర్వహించవచ్చు. ఒక్కో అవుట్‌లెట్‌ను 80 నుంచి 100 అడుగుల స్థలంలో కంటైనర్ స్టాల్‌గా ఏర్పాటు చేస్తారు.
చాయ్‌రస్తాలను బస్టాండ్లు, ఆస్పత్రులు, మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు వంటి రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెప్మా ద్వారా నిరంతర పర్యవేక్షణ, సహకారం అందించనున్నారు. ఈ పథకం ద్వారా మహిళలు నెలకు స్థిర ఆదాయం పొందడంతో పాటు, స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగడానికి అవకాశం లభిస్తుందని అధికారులు తెలిపారు. ఆసక్తి గల మహిళలు మెప్మాలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.