ఆంధ్రప్రదేశ్‌లో పేద మహిళలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేస్తోంది. ఈ పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన ఈ పథకాన్ని మళ్లీ పునఃప్రారంభించి, 2025–26 ఆర్థిక సంవత్సరం వరకు అర్హులైన మహిళలకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.
ఈ పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్‌కు అవసరమైన సిలిండర్, రెగ్యులేటర్, పైపు, గ్యాస్ బుక్, బిగింపు ఖర్చులు అన్నింటినీ ఆయిల్ కంపెనీలే భరిస్తాయి. మొత్తం మీద సుమారు రూ.2,050 ఖర్చు పూర్తిగా ఉచితంగా అందుతుంది. అంటే మహిళలు గ్యాస్ కనెక్షన్ కోసం రూ.2 వేలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. తొలి సిలిండర్ పూర్తిగా ఉచితం కాగా, ఆ తర్వాత ప్రతి సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం రూ.300 సబ్సిడీ అందిస్తుంది.
ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో జిల్లా ఉజ్వల కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ప్రతినిధి జిల్లా కోఆర్డినేటర్‌గా, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సభ్యుడిగా ఉంటారు. ఈ కమిటీ పథకం అమలుపై పర్యవేక్షణ చేస్తుంది. దరఖాస్తుదారుల ఇంట్లో ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళలు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు తప్పనిసరిగా సమర్పించాలి. రేషన్ కార్డులో పేరు ఉండాలి. నెలకు రూ.10 వేల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. ఆదాయ ధ్రువీకరణ కోసం రెవెన్యూ అధికారుల సర్టిఫికేట్ అవసరం. వలస కార్మికులు కూడా అర్హతలు ఉంటే ఈ పథకాన్ని పొందవచ్చు.
ఈ పథకం కింద మహిళలకు 14.2 కిలోల ఒక సింగిల్ సిలిండర్ లేదా 5 కిలోల రెండు సిలిండర్లు పొందే అవకాశం ఉంటుంది. అర్హులైన మహిళలు సమీపంలోని గ్యాస్ ఏజెన్సీలను సంప్రదించి అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు వంటగ్యాస్ సౌకర్యం అందడంతో పాటు, మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.