ఆంధ్రప్రదేశ్‌లోని రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక శుభవార్త అందించింది. గుంతకల్లు – మార్కాపురం మధ్య డైలీ ప్యాసింజర్ రైలును నడపాలన్న ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో ఉందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయంతో నంద్యాల జిల్లా ప్రజల్లో, ముఖ్యంగా రోజువారీ రైలు ప్రయాణికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీ బైరెడ్డి శబరి నంద్యాల జిల్లాలోని రైల్వే సేవలపై కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించారు. నంద్యాల మీదుగా గుంతకల్లుకు పగటి పూట మెమో లేదా ప్యాసింజర్ రైలు నడపాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ఆమె కోరారు. ప్రస్తుతం ఈ మార్గంలో నడిచే రైళ్లన్నీ రాత్రి వేళల్లోనే ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె వివరించారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు అర్ధరాత్రి ప్రయాణాలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
నంద్యాల నుంచి గుంతకల్లుకు వెళ్లే నాలుగు రైళ్లు పూర్తిగా రాత్రి సమయాల్లో మాత్రమే ఉండటం ఈ మార్గాన్ని ఉపయోగించే ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. పగటి సమయంలో రైలు సౌకర్యం లేకపోవడంతో రోడ్డు మార్గాలపై ఆధారపడాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాల మీదుగా గుంతకల్లు – మార్కాపురం వరకు రోజువారీ ప్యాసింజర్ రైలును ప్రారంభిస్తే వేలాది మంది ప్రయాణికులకు ఉపశమనం కలుగుతుందని ఎంపీ బైరెడ్డి శబరి రైల్వే శాఖకు వివరించారు.
ఇదే కాకుండా బేతంచెర్ల మీదుగా దుపాడు వరకూ కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కూడా గతంలో ఎంపీ కేంద్రానికి సమర్పించారు. ప్రాంత అభివృద్ధి, రవాణా సౌలభ్యం దృష్ట్యా ఈ మార్గంలో కొత్త రైలు సేవలు అవసరమని ఆమె స్పష్టం చేశారు. ఈ అంశాలపై అప్పట్లోనే రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. తాజాగా రైల్వే శాఖ గుంతకల్లు – మార్కాపురం డైలీ ప్యాసింజర్ రైలు ప్రతిపాదన పరిశీలనలో ఉందని ప్రకటించడంతో, త్వరలోనే ఈ మార్గంలో పగటి పూట రైలు సేవలు అందుబాటులోకి వస్తాయన్న ఆశలు బలపడుతున్నాయి.