ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏపీఎస్‌ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవల విడుదలైన నోటిఫికేషన్‌కు దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఐటీఐ అభ్యర్థుల కోసం ధ్రువపత్రాల పరిశీలన (Certificate Verification) తేదీలను ఏపీఎస్‌ఆర్టీసీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల ప్రిన్సిపల్ వి. నీలిమ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నిర్ణయించిన తేదీల్లో తప్పనిసరిగా హాజరుకావాలని అధికారులు సూచించారు.
ఏపీఎస్‌ఆర్టీసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ట్రేడ్ల వారీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. మోటర్ మెకానిక్, ఫిట్టర్, డ్రాట్స్‌మెన్ (సివిల్), వెల్డర్, పెయింటర్ అండ్ మెషినిస్ట్ ట్రేడ్స్‌కు డిసెంబర్ 24న ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌కు డిసెంబర్ 26, 27 తేదీల్లో, డీజిల్ మెకానిక్ ట్రేడ్‌కు డిసెంబర్ 29, 30 తేదీల్లో వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. చెరువు సెంటర్, విద్యాధరపురం, విజయవాడ జోన్‌లలో ఉదయం 10 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.
సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్‌లైన్ దరఖాస్తు చేసిన ప్రొఫైల్ కాపీ, 10వ తరగతి సర్టిఫికేట్, ఐటీఐ మార్కుల మెమో, ఎన్‌సీవీటీ సర్టిఫికేట్, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు తీసుకురావాల్సి ఉంటుంది. అదనంగా, ఎన్‌సీసీ లేదా స్పోర్ట్స్ సర్టిఫికేట్లు (ఉంటే), దివ్యాంగులైతే పీహెచ్‌సీ సర్టిఫికేట్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలని సూచించారు. ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు కూడా తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.
సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో ప్రతి అభ్యర్థి రూ.118 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారా మొత్తం 291 అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అర్హులైన ఐటీఐ అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో సమయానికి హాజరుకావాలని అధికారులు సూచించారు. ప్రభుత్వ రంగంలో శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలకు ఇది మంచి వేదికగా మారనుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.