శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన విషాద ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, పూర్తి వివరాలతో వివరణ ఇచ్చారు. ఏకాదశి సందర్భంగా పెద్దఎత్తున భక్తులు కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి తరలివచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రవేశద్వారం వద్ద తోపులాట జరిగి తొమ్మిది మంది దుర్మరణం చెందగా, పదహారు మంది గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోం మంత్రి వంగలపూడి అనితలతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను పలాస సీహెచ్‌సీ ఆసుపత్రిలో పరామర్శించి, వైద్యులను వారి ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ ఘటనకు ప్రధాన కారణం అనుకోకుండా భారీగా భక్తులు తరలిరావడమేనని మంత్రి పేర్కొన్నారు. ఈ దేవాలయం గత నాలుగైదేళ్లుగా నిర్మాణంలో ఉండగా, కేవలం నాలుగు నెలల క్రితం ప్రతిష్ఠాపన జరగింది. స్థానిక అధికారులు, పోలీసులు ఇంతమంది భక్తులు వస్తారని ముందుగానే అంచనా వేయలేకపోయారని తెలిపారు. ఉదయం దర్శనం కోసం వచ్చిన భక్తులు, ఆలయం మూసివేసే సమయానికి కూడా ఎంట్రీ మార్గంలో ఉండడం వల్ల ఒకే మార్గంలో తోపులాట జరిగిందని వివరించారు. పై మెట్ల వద్ద ఒక్కొక్కరు కిందపడుతూ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిపారు.
బ్యారికేడింగ్ సరిగా చేయకపోవడమే ప్రమాద తీవ్రతకు మరో కారణమని మంత్రి గుర్తించారు. సాధారణంగా ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఆరు అంగుళాల ఫౌండేషన్ ఉండాలి. కానీ ఈ ప్రాంతంలో కేవలం రెండున్నర అంగుళాల ఫౌండేషన్ మాత్రమే ఉండడంతో అది విరిగి భక్తులు పడిపోయారని తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే ఎమ్మెల్యేలు, అధికారులు, మంత్రులు అందరూ సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందజేశారని చెప్పారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సాయం, తీవ్రంగా గాయపడిన వారికి రూ.3 లక్షల సాయం అందజేస్తామని మంత్రి ప్రకటించారు. అదనంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు ఆర్థిక సాయం ప్రకటించబడిందన్నారు. తెలుగు దేశం పార్టీ తరపున మరణించిన ముగ్గురు కార్యకర్తల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా సాయం అందిస్తామని తెలిపారు. అంతేకాక, మృతి చెందిన కుటుంబాలకు తక్షణమే మట్టి ఖర్చుల కోసం రూ.10,000 చొప్పున ప్రభుత్వం సాయం అందజేసిందని వివరించారు.
ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల కార్యకలాపాలు, ముఖ్యమైన తేదీలు, భక్తుల సంఖ్యపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ప్రైవేటు వ్యక్తులు నిర్మించే దేవాలయాల విషయంలో కూడా సురక్షిత చర్యలు తీసుకునే విధంగా కొత్త వ్యవస్థ రూపొందించనున్నామని చెప్పారు. పాండా గారు మంచి మనసుతో భక్తుల కోసం దేవాలయాన్ని నిర్మించారని, కానీ భవిష్యత్తులో భద్రతా ప్రమాణాలు తప్పనిసరి చేయబడతాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు.