భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 2026 సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బ్యాంకులకు వర్తించే అధికారిక సెలవుల జాబితాను విడుదల చేసింది. బ్యాంకింగ్ సేవలు వినియోగించే ఖాతాదారులు ఈ సెలవులను ముందుగానే గమనించి తమ ఆర్థిక లావాదేవీలు ప్లాన్ చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది. జాతీయ సెలవులతో పాటు, స్థానిక పండుగలు, మతపరమైన వేడుకల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని తేదీల్లో స్వల్ప తేడాలు ఉన్నట్లు స్పష్టం చేసింది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో వేర్వేరు రోజుల్లో రంజాన్, మొహర్రం, మిలాద్ ఉన్ నబీ సెలవులు ఉండటం గమనార్హం.
సాధారణంగా ప్రతి నెలా రెండో, నాలుగో శనివారాలు అలాగే అన్ని ఆదివారాలు బ్యాంకులకు సెలవులుగా కొనసాగుతాయి. వీటికి అదనంగా ఆర్బీఐ ప్రకటించిన పండుగ సెలవులు అమల్లో ఉంటాయి. అయితే బ్యాంకులు మూసివున్నప్పటికీ, ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం సేవలు మాత్రం నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. కాబట్టి నగదు అవసరాలు, ముఖ్యమైన లావాదేవీలు ఉంటే ముందుగానే ఏర్పాట్లు చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. 2026లో దీపావళి నవంబర్ 8న ఆదివారం రావడం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం.
2026 సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లో జనవరి నుంచి డిసెంబర్ వరకు పలు ముఖ్యమైన బ్యాంక్ సెలవులు ఉన్నాయి. జనవరి 15న మకర సంక్రాంతి, జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా బ్యాంకులు మూసివుంటాయి. మార్చిలో హోలీ, ఉగాది, రంజాన్, శ్రీరామ నవమి సెలవులు ఉన్నాయి. ఏప్రిల్‌లో ఖాతాల వార్షిక ముగింపు రోజు, గుడ్ ఫ్రైడే, డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉన్నాయి. మే నెలలో మే డే, బక్రీద్ సెలవులు ఉండగా, జూన్‌లో మొహర్రం ఏపీ, తెలంగాణల్లో వేర్వేరు తేదీల్లో ఉంది. జులై నెలలో ప్రత్యేక బ్యాంక్ సెలవులు లేవు.
ఆగస్టులో స్వాతంత్ర్య దినోత్సవం, మిలాద్ ఉన్ నబీ సెలవులు ఉండగా, సెప్టెంబరులో శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి ఉన్నాయి. అక్టోబర్‌లో మహాత్మా గాంధీ జయంతి, విజయదశమి సెలవులు ఉన్నాయి. నవంబర్‌లో గురునానక్ జయంతి తెలంగాణలో మాత్రమే వర్తిస్తుండగా, డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివుంటాయి. ఈ సెలవుల జాబితా ఆధారంగా చెక్కుల క్లియరెన్స్, లోన్ ప్రాసెసింగ్, బ్రాంచ్ విజిట్స్ వంటి పనులను ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఇబ్బందులు ఉండవని బ్యాంకింగ్ వర్గాలు సూచిస్తున్నాయి.