Norway Ugadi 2026 Celebrations: నార్వే రాజధాని ఓస్లో నగరంలో తెలుగు వెలుగులు విరజిమ్మాయి. నార్వే తెలుగు సంఘం (NTA) పదేళ్ల మైలురాయిని చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని, 'దశాబ్ది ఉత్సవాలు - ఉగాది సంబరాలు 2026' పేరుతో నిర్వహించిన వేడుకలు అంబరాన్నంటాయి. మార్చి 21న జరిగిన ఈ వేడుకలో సుమారు 350 మందికి పైగా ప్రవాస తెలుగు కుటుంబాలు పాల్గొని, పరాయి గడ్డపై మన సంస్కృతీ సంప్రదాయాలను చాటిచెప్పారు.
ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి నార్వేలోని ప్రముఖ రాజకీయ నేతలు భారత దౌత్యవేత్తలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అకెర్షస్ కౌంటీ డిప్యూటీ మేయర్ ఓలే జాకబ్ జోహన్సెన్, భారత రాయబార కార్యాలయ ప్రతినిధి ఎస్. మాగేష్ కుమార్, ఆస్కర్ మేయర్ లెనె కాన్రాడి ఈ వేడుకలో పాల్గొని ప్రవాస తెలుగు వారు తమ మూలాలను మర్చిపోకుండా చేస్తున్న కృషిని అభినందించారు.
కార్యక్రమంలో మరో విశేషం ఏమిటంటే, భారతదేశం నుండి అగ్ర నాయకులు పంపిన వీడియో సందేశాలు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారితో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు నార్వే తెలుగు సంఘం ప్రయాణాన్ని కొనియాడుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది అక్కడి వారికి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది.
వేదికపై జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. చిన్నారి పిల్లల నృత్యాలు అందరినీ ఆకట్టుకోగా, స్టాక్‌హోమ్ నుండి వచ్చిన అలెన్ స్కూల్ ఆఫ్ డాన్సెస్ బృందం, డాక్టర్ సరళ కుమారి గారి కూచిపూడి నృత్యం మరియు ముద్ర డాన్స్ అకాడమీ సభ్యుల ప్రదర్శనలు ఈ వేడుకకు నిండుదనాన్ని ఇచ్చాయి. కేవలం వినోదం మాత్రమే కాకుండా, మన కళల గొప్పదనాన్ని ఈ ప్రదర్శనలు చాటాయి.
నార్వే తెలుగు సంఘం పదేళ్ల ప్రయాణంలో వెన్నంటి నిలిచిన పాత కార్యవర్గ సభ్యులను (Past Board Members) ఈ సందర్భంగా ప్రత్యేకంగా సత్కరించారు. వారికి మెమెంటోలు అందించి కృతజ్ఞతలు తెలిపారు. సుదూర ప్రాంతంలో ఉంటూ కూడా మన భాషను, పండుగలను కాపాడుకుంటూ వస్తున్న ఎన్టీఏ (NTA) సభ్యుల కృషిని అతిథులు మనస్ఫూర్తిగా ప్రశంసించారు. చివరగా తెలుగు వారి విందు భోజనంతో ఈ ఉత్సవం ఘనంగా ముగిసింది.