విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ ప్రతినిధుల్ని ఆహ్వానిస్తోంది. ఈ మేరకు సింగపూర్ దేశంలో గతంలో పర్యటించిన ముఖ్యమంత్రి బృందం.. ఇప్పుడు యూఏఈకి వెళ్లనుంది. నవంబరు 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు కోసం సీఎం దుబాయ్ లో రోడ్ షో నిర్వహించనున్నారు.
అలాగే పర్యటన చివరి రోజున దుబాయ్ లో AP NRT ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ సహా వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలను, కంపెనీలను, ప్రభుత్వ ప్రతినిధులను విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు ముఖ్యమంత్రి ఆహ్వానించనున్నారు.
22 తేదీన ఉదయం హైదరాబాద్ కు 10 గంటలకు చేరుకుని... అక్కడి నుంచి నేరుగా దుబాయ్ కు వెళ్లనున్నారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటారు. దుబాయ్ చేరుకున్న తొలి రోజు నుంచే ముఖ్యమంత్రి వివిధ పారిశ్రామిక వేత్తలతో భేటీలు నిర్వహించనున్నారు.
సీఎం పర్యటించే మూడు రోజుల్లో వీలైనంత మంది పారిశ్రామికవేత్తలను కలిసేలా యూఏఈ పర్యటన ఉండబోతోంది. ప్రభుత్వ ప్రతినిధులతో 3, పారిశ్రామిక వేత్తలతో 14 వన్ టు వన్, రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 సైట్ విజిట్స్ 2, మీడియా ఇంటర్వ్యూలు 2, సీఐఐ పీఎస్ రోడ్ షో 1, తెలుగు డయాస్పోరా 1 సహా మొత్తం మూడు రోజుల పాటు 25 సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇక ప్రతి రోజూ ఐదారు సమావేశాలు ఉండేలా ముఖ్యమంత్రి యూఏఈ పర్యటన ఉండబోతోంది.
తొలిరోజు పర్యటనిలా…
తొలిరోజు పర్యటనలో భాగంగా 22వ తేదీన ఐదు కంపెనీలకు చెందిన పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ కానున్నారు. శోభా గ్రూప్, షరాఫ్ డీజీ, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లూధా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం అవుతారు. వీరితో వన్ టు వన్ సమావేశాలు నిర్వహిస్తారు.
వీరితో జరిపే వేర్వేరు భేటీల్లో ఇండస్ట్రీయల్, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ సదుపాయాలు, పోర్టులు-షిప్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో పెట్టుబడులపై ఆయా సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. తొలి రోజు పర్యటనలో ముఖ్యమంత్రి బృందం పలు ప్రాంతాలను సందర్శించనుంది. మ్యూజియం సందర్శనలో భాగంగా జర్నీ టూ 2071 థీమ్ తో ఉండే స్పేస్ ట్రావెల్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను సీఎం పరిశీలిస్తారు.
అలాగే ఇదే మ్యూజియంలో ఏర్పాటు చేసిన భవిష్యత్ టెక్నాలజీ సొల్యూషన్స్ అనే అంశంపైనా సీఎం అధ్యయనం చేయనున్నారు. ఇక రాత్రికి సీఐఐ భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన రోడ్ షోకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. ఈ రోడ్ షోలో పాల్గొని వివిధ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు.
అలాగే విశాఖలో వచ్చే నెల 14,15వ తేదీల్లో జరగబోయే పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానించనున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్థన్ రెడ్డి, సీఎం సెక్రటరీ కార్తికేయ మిశ్రా, ఇండస్ట్రీస్ సెక్రటరీ యువరాజ్, ఏపీ ఇడిబి సీఈఓ సాయికాంత్ వర్మ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ ధాత్రిరెడ్డి దుబాయ్ పర్యటనలో పాల్గొననున్నారు.
