బహ్రెయిన్‌లో నరకయాతన నుంచి ఆంధ్ర మహిళకు విముక్తి.. అండగా నిలిచిన జనసేన, APNRT!

APNRT: బహ్రెయిన్‌లో యజమాని వేధింపులకు గురై తిండి, నీరు లేక నరకయాతన అనుభవించిన ఏలూరు జిల్లా ప్రతికోళ్ల లంక వాసి కటికల వెంకటేశ్వరమ్మను గల్ఫ్ జనసేన బహ్రెయిన్ టీమ్, APNRT మరియు భారత రాయబార కార్యాలయ సమన్వయంతో సురక్షితంగా కాపాడి స్వదేశానికి చేర్చారు. పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో నిరంతరం శ్రమించి ఆమెను ప్రాణాపాయం నుంచి రక్షించి స్వస్థలానికి చేర్చడం ప్రవాసాంధ్రుల్లో హర్షాన్ని నింపింది.

బహ్రెయిన్‌లో నరకయాతన నుంచి ఆంధ్ర మహిళకు విముక్తి
బహ్రెయిన్‌లో నరకయాతన నుంచి ఆంధ్ర మహిళకు విముక్తి
  • ఏపీఎన్ఆర్టీ ప్రత్యేక చొరవ.. బహ్రెయిన్ భారత రాయబార కార్యాలయంతో పక్కా సమన్వయం!
  • ఆపదలో ఉన్న ఆడబిడ్డకు భరోసా.. బహ్రెయిన్ గల్ఫ్ జనసేన నిరంతర పోరాటం!
  • ఎంబసీ అధికారుల సత్వర జోక్యం.. రెస్క్యూ నుంచి ప్రయాణ ఏర్పాట్ల దాకా సంపూర్ణ సహకారం!

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు నియోజకవర్గం, ప్రతికోళ్ల లంక గ్రామానికి చెందిన కటికల వెంకటేశ్వరమ్మ తమ కుటుంబ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు సుమారు ఏడాది క్రితం ఒక ఏజెంట్ ద్వారా బహ్రెయిన్ వెళ్లారు. అక్కడ ఒకరి ఇంట్లో హౌస్‌మేడ్‌గా చేరిన ఆమెకు కొద్దిరోజుల్లోనే తీవ్ర కష్టాలు మొదలయ్యాయి. పనిచేస్తున్న యజమాని వద్ద నుంచి తీవ్ర వేధింపులు, శారీరక దాడులు ఎదురవుతూ, సరైన ఆహారం మరియు కనీస తాగునీరు కూడా అందక ఆమె ఆరోగ్యం క్షీణించింది. ప్రతిరోజూ నరకయాతన అనుభవిస్తున్న పరిస్థితిని వివరిస్తూ, తనను రక్షించాలంటూ ఆమె కన్నీటి పర్యంతమై ఒక అత్యవసర వీడియో సందేశాన్ని తన కుటుంబ సభ్యులకు పంపించారు.

ఆందోళనలో కుటుంబ సభ్యులు – గల్ఫ్ జనసేన తక్షణ స్పందన

తన ప్రాణాలకు ముప్పు ఉందని వెంకటేశ్వరమ్మ పంపిన వీడియోను చూసి స్వగ్రామంలోని ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి, ఆందోళనకు గురయ్యారు. ఏ దిక్కూ తోచని స్థితిలో వారు గల్ఫ్ జనసేన బహ్రెయిన్ టీమ్‌ను సంప్రదించి తమ గోడును వెళ్లబోసుకున్నారు. బాధిత మహిళ పడుతున్న అగచాట్లను గుర్తించిన గల్ఫ్ జనసేన బృందం ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగింది. ఆమె వివరాలు, వీడియో సాక్ష్యాలు, బహ్రెయిన్‌లో ఆమె ఉన్న ప్రాంతానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి, రాష్ట్ర ప్రభుత్వ ప్రవాసాంధ్రుల సంక్షేమ సంస్థ అయిన APNRT దృష్టికి అత్యవసరంగా తీసుకెళ్లింది.

APNRT డైరెక్టర్, ప్రత్యేక బృందంతో ముమ్మర సంప్రదింపులు

గల్ఫ్ జనసేన బహ్రెయిన్ నేషనల్ కన్వీనర్ మరియు APNRT మద్దతుదారుడు, నిస్వార్థ సేవా తత్పరత, నిరంతర క్రియాశీలత కలిగి గల్ఫ్ గడ్డపై ఏ ఒక్క తెలుగు బిడ్డకు కష్టమొచ్చినా తన సొంత సమస్యగా భావించి, అధికార యంత్రాంగాన్ని కదిలించి పరిష్కారం చూపే నిజమైన ప్రజా సేవకుడిగా దొడ్డిపాటి శ్రీనివాసరావు వ్యవహరిస్తున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను కేవలం మాటలకే పరిమితం చేయకుండా, చేతల్లో చూపుతూ ప్రవాసాంధ్రుల కన్నీళ్లను తుడిచే కొండంత భరోసానిస్తున్నారు. ఈ కేసును అత్యంత తీవ్రమైన మానవతా సమస్యగా పరిగణించిన గల్ఫ్ జనసేన ఆయన, APNRT డైరెక్టర్ మరియు సహచర బృందంతో పలుమార్లు వ్యక్తిగతంగా మాట్లాడారు. వెంకటేశ్వరమ్మ ప్రాణాలకు హాని కలగకుండా వెంటనే రక్షించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ క్రమంలో APNRT డైరెక్టర్‌తో పాటు రామదాస్ మరియు సంబంధిత సపోర్ట్ టీమ్ ప్రతి దశలోనూ అత్యంత వేగంగా స్పందించారు. అవసరమైన పత్రాలను సిద్ధం చేయడం, కేసు స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షించడం మరియు తాజా సమాచారాన్ని సమన్వయం చేయడంలో ఆదర్శవంతమైన తోడ్పాటును అందించారు.

భారత రాయబార కార్యాలయం చొరవ – యజమాని చెర నుంచి విముక్తి

APNRT బృందం నిరంతరం చేసిన సమన్వయం మరియు ఫాలోఅప్ ఫలితంగా ఈ అంశం బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) ఉన్నతాధికారుల అధికారిక పరిశీలనకు చేరింది. ఎంబసీ అధికారులు వెంటనే స్థానిక యంత్రాంగంతో మాట్లాడి ప్రత్యేక చర్యలు చేపట్టారు. తీవ్ర నిర్బంధం, వేధింపుల మధ్య బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న వెంకటేశ్వరమ్మను ఆ యజమాని ఇంటి నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. రాయబార కార్యాలయ అధికారులు ఆమెకు అవసరమైన తాత్కాలిక ఆశ్రయం, కనీస వైద్య సదుపాయాలు కల్పించి భరోసా కల్పించారు.

స్వదేశానికి తిరుగు ప్రయాణం – అధికారిక లాంఛనాల పూర్తి

యజమాని చెర నుంచి విముక్తి లభించిన అనంతరం ఆమెను భారత్‌కు పంపించే ప్రక్రియను వేగవంతం చేశారు. ప్రయాణ పత్రాల పునరుద్ధరణ, ఎగ్జిట్ క్లియరెన్స్‌లు మరియు విమాన టికెట్ల సమన్వయం వంటి అన్ని రకాల ఏర్పాట్లను భారత రాయబార కార్యాలయం, ఏపీఎన్ఆర్టీ బృందాలు దగ్గరుండి పర్యవేక్షించాయి. అన్ని అడ్డంకులు తొలగిపోయిన తర్వాత వెంకటేశ్వరమ్మ బహ్రెయిన్ నుంచి విమానంలో స్వదేశానికి బయలుదేరారు. ఎట్టకేలకు ఆమె సురక్షితంగా భారతదేశానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

సహకరించిన అధికారులకు, ఏపీఎన్ఆర్టీ బృందానికి కృతజ్ఞతలు

ఒక నిస్సహాయురాలైన మహిళను కాపాడే క్రమంలో ప్రతి దశలోనూ వెన్నంటే ఉండి సహకరించిన APNRT డైరెక్టర్‌కు, రామదాస్‌కు మరియు APNRT సపోర్ట్ సిబ్బందికి గల్ఫ్ జనసేన బహ్రెయిన్ టీమ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసింది. నిరంతరం టచ్‌లో ఉంటూ సమన్వయం చేసిన ఏపీఎన్ఆర్టీ మద్దతు వల్లే ఈ సంక్లిష్ట సమస్య ఇంత త్వరగా పరిష్కారమైందని పేర్కొంది. అలాగే అత్యంత మానవతా దృక్పథంతో తక్షణ చర్యలు తీసుకుని కాపాడిన భారత రాయబార కార్యాలయ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు సమర్పించింది.

శ్రీ పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితోనే ఈ విజయం

ప్రజల కష్టాలపై తక్షణమే స్పందించడం, ఆపదలో ఉన్నవారికి నిస్వార్థంగా అండగా నిలవడం అనే సేవా స్ఫూర్తిని తాము శ్రీ పవన్ కళ్యాణ్ నాయకత్వం నుంచే నేర్చుకున్నామని గల్ఫ్ జనసేన బృందం స్పష్టం చేసింది. ఆయన చూపిన ప్రజాసేవ మార్గదర్శకమే తమను గల్ఫ్ దేశాల్లో నిరంతరం సేవా కార్యక్రమాలు చేపట్టేలా ముందుకు నడిపిస్తోందని తెలిపింది. నాగబాబు అందించిన నిరంతర ప్రోత్సాహం మరియు మార్గదర్శకత్వం కూడా ఇలాంటి క్లిష్టమైన సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ఎంతో బలాన్ని ఇచ్చిందని వెల్లడించింది.

ఆపదలో నిలవడమే అసలైన సంతృప్తి – గల్ఫ్ జనసేన భరోసా

మన వంతుగా చేసే చిన్న సహాయమైనా ఒకరి జీవితంలో వెలుగులు నింపి, వారి సమస్య తీరి వారు చిరునవ్వుతో ఉన్నారని తెలుసుకున్నప్పుడు కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిదని బాధ్యులు పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న తోటి మనుషులకు ఆసరాగా నిలబడి, వారి సంక్షేమం కోసం పనిచేయడమే తమకు కొండంత సంతృప్తిని ఇస్తుందని తెలిపారు. భవిష్యత్తులోనూ గల్ఫ్ దేశాలలో ఎలాంటి ఆపదలు ఎదురైనా ప్రవాసాంధ్రులకు సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని గల్ఫ్ జనసేన బహ్రెయిన్ స్పష్టం చేసింది.

Tags

Be the first to react

Latest