ఇదే చివరి హెచ్చరిక.. గుర్తుపెట్టుకో విజయసాయిరెడ్డి..
విజయసాయిరెడ్డికి అన్ని పార్టీల్లో డోర్లు క్లోజ్..
విజయవాడ: విజయవాడలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న, వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
చంద్రబాబుపై విజయసాయిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు మితిమీరాయని వెంకన్న మండిపడ్డారు. “చంద్రబాబుపై మతిభ్రమించి మాట్లాడుతున్నారు. మరోసారి ఇలాగే మాట్లాడితే మీకు దేహశుద్ధి ఖాయం. ఇదే చివరి హెచ్చరిక, గుర్తుపెట్టుకో విజయసాయిరెడ్డి,” అంటూ కఠినంగా హెచ్చరించారు.
విజయసాయిరెడ్డికి అన్ని రాజకీయ పార్టీల్లో అవకాశాలు మూసుకుపోయాయని కూడా వెంకన్న వ్యాఖ్యానించారు. “తన సొంత పార్టీ తరఫున సర్పంచ్‌గా గెలిచినా నేను రాజకీయాలు వదిలేస్తా,” అంటూ సవాల్ విసిరారు.
చంద్రబాబుకు వస్తున్న ఖ్యాతిని చూసి ఓర్వలేకపోతున్నారని, అదే కారణంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. అలాగే గత ఐదేళ్లలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం నష్టపోయిందని ఆరోపించారు.
అమరావతి అభివృద్ధి చూసి వైసీపీ నేతలు అసహనంగా ఉన్నారని, అందుకే విషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని వెంకన్న పేర్కొన్నారు. “చంద్రబాబు, అమరావతిపై ఎవరు విషం చిమ్మినా చూస్తూ ఊరుకోం. అవసరమైతే కఠినంగా ఎదుర్కొంటాం,” అని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి పెంచాయి.