OCI ప్రక్రియలు పూర్తిగా ఆన్లైన్ ద్వారానే..
మైనర్లపై స్పష్టమైన నిబంధనలు..
బయోమెట్రిక్ డేటాతో వేగవంతమైన ఇమ్మిగ్రేషన్..
న్యూ ఢిల్లీ: విదేశాల్లో నివసించే భారతీయులకు (OCI కార్డ్ హోల్డర్లకు) సంబంధించిన పౌరసత్వ విధానంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక మార్పులు చేసింది. ఈ సవరణల ద్వారా వ్యవస్థను మరింత సులభతరం చేసి, పూర్తిగా డిజిటల్ విధానానికి మార్చే దిశగా అడుగులు వేసింది.
ఇప్పటివరకు ఆన్‌లైన్‌తో పాటు కాగితాల ప్రక్రియ కూడా ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం ఇకపై OCI నమోదు, రద్దు చేయడం (cancellation) వంటి అన్ని ప్రక్రియలు పూర్తిగా ఆన్లైన్ ద్వారానే జరగనున్నాయి. దీంతో దరఖాస్తుదారులకు సమయం, శ్రమ తగ్గే అవకాశముంది.
హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, “OCI కార్డు కోసం దరఖాస్తు పూర్తిగా ఆన్లైన్ పోర్టల్ ద్వారా చేయాలి” అని స్పష్టం చేసింది. అలాగే భవిష్యత్తులో ఫిజికల్ కార్డ్‌తో పాటు ఎలక్ట్రానిక్ OCI (e-OCI) కూడా జారీ చేసే అవకాశాన్ని కల్పించింది. అన్ని రికార్డులు ఎలక్ట్రానిక్ రూపంలోనే భద్రపరుస్తారు.
ఇప్పటివరకు ప్రాక్టీస్‌లో ఉన్న కానీ స్పష్టంగా రూల్స్‌లో లేని కొన్ని అంశాలను ఇప్పుడు అధికారికంగా చేర్చారు. ముఖ్యంగా మైనర్ల విషయంలో, ఒక చిన్నారి ఒకేసారి భారత పాస్‌పోర్ట్‌తో పాటు మరో దేశ పాస్‌పోర్ట్‌ను కలిగి ఉండకూడదని నిబంధనను స్పష్టంగా పేర్కొన్నారు.
OCI హోదాను వదులుకోవాలనుకునే వారు కూడా ఇకపై ఆన్లైన్ ద్వారానే ప్రకటన ఇవ్వాలి. ఫిజికల్ కార్డ్ ఉన్నవారు సంబంధిత అధికారులకు దాన్ని సమర్పించాలి. దరఖాస్తు పూర్తయిన తర్వాత ఎలక్ట్రానిక్ అంగీకారం (acknowledgement) జారీ చేస్తారు. తరువాత వారి పేరు అధికారిక రికార్డుల నుంచి తొలగిస్తారు. రద్దు చేసిన కార్డులు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.
ముందుగా ఉన్నప్పటికీ స్పష్టతలేని రివ్యూ ప్రక్రియను ఇప్పుడు మరింత క్రమబద్ధంగా మార్చారు. ఒక నిర్ణయంపై అభ్యంతరం ఉంటే, దాన్ని ఒక స్థాయి పై ఉన్న అధికారి పరిశీలిస్తారు. అలాగే, సంబంధిత వ్యక్తికి తన వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని నిబంధనల్లో పేర్కొన్నారు.
కొత్తగా ప్రవేశపెట్టిన మరో ముఖ్య అంశం బయోమెట్రిక్ డేటా వినియోగం. OCI దరఖాస్తుదారులు తమ బయోమెట్రిక్ వివరాలను “ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ప్రోగ్రామ్” కోసం ఉపయోగించేందుకు ముందుగానే అంగీకారం ఇవ్వాలి. దీని వల్ల భవిష్యత్తులో విమానాశ్రయాల్లో వేగవంతమైన ప్రవేశం సాధ్యమవుతుంది.
ఇంతకు ముందు ఉండే డూప్లికేట్ దరఖాస్తులు వంటి అనవసరమైన ప్రక్రియలను పూర్తిగా తొలగించారు. మొత్తం వ్యవస్థను సులభంగా, పారదర్శకంగా మార్చే దిశగా ఈ మార్పులు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ సవరణలతో OCI కార్డ్ హోల్డర్లకు సేవలు మరింత సులభం కావడంతో పాటు, ప్రభుత్వానికి కూడా పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా ఉండనుంది.