ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వాలు నగరాల్లో ప్రజలకు ఫ్రీ పబ్లిక్ వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, బస్టాప్‌లు, పార్కులు, లైబ్రరీలు, పర్యాటక ప్రాంతాలు వంటి జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఈ వైఫై నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మొబైల్ డేటా అందుబాటులో లేని పరిస్థితుల్లో లేదా అత్యవసరంగా ఇంటర్నెట్ అవసరమైనప్పుడు చాలా మంది ఈ పబ్లిక్ వైఫైను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ సౌకర్యంతో పాటు కొన్ని తీవ్ర భద్రతా ప్రమాదాలు కూడా ఉన్నాయని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లకు ఎవరైనా సులభంగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉండటంతో, సైబర్ నేరగాళ్లు వాటిని తమ మోసాలకు వేదికగా మార్చుకుంటున్నారు. హ్యాకర్లు పబ్లిక్ వైఫై సర్వర్లను హ్యాక్ చేసి యూజర్ల మొబైల్ ఫోన్లలోని వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డులు, బ్యాంక్ వివరాలను సులభంగా పొందే ప్రమాదం ఉందని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా పబ్లిక్ వైఫై ఉపయోగిస్తున్న సమయంలో యూజర్లు తెలియకుండానే తమ డేటాను షేర్ చేసే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల పబ్లిక్ వైఫై వినియోగంలో అత్యంత జాగ్రత్త అవసరమని సూచిస్తున్నారు.
బ్యాంకింగ్ కార్యకలాపాలు, ఆన్‌లైన్ లావాదేవీల విషయంలో పబ్లిక్ వైఫైను పూర్తిగా దూరంగా పెట్టాలని సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. నెట్ బ్యాంకింగ్, యూపీఐ ట్రాన్సాక్షన్లు, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వివరాలు ఎంటర్ చేసే సందర్భాల్లో పబ్లిక్ వైఫై వాడటం ప్రమాదకరమని తెలిపారు. అలాగే ఈ-కామర్స్ వెబ్‌సైట్లు లేదా షాపింగ్ యాప్‌లలో కొనుగోళ్లు చేసేటప్పుడు వ్యక్తిగత, ఆర్థిక సమాచారం ఇవ్వాల్సి వస్తుందనీ, ఇది సైబర్ నేరగాళ్లకు అవకాశం కల్పించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తే, అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇక ప్రయాణ సమయంలో మొబైల్ ఫోన్లలో ఆటోమేటిక్ వైఫై కనెక్టివిటీని ఆఫ్ చేసుకోవాలని హైదరాబాద్ పోలీసులు సూచించారు. తెలియని నెట్‌వర్క్‌లకు ఫోన్ ఆటోమేటిక్‌గా కనెక్ట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని తెలిపారు. అలాగే పబ్లిక్ ప్రదేశాల్లో బ్లూటూత్‌ను కూడా ఆఫ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. బ్లూటూత్ ద్వారా కూడా ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, దీని వల్ల వ్యక్తిగత డేటా ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. పబ్లిక్ వైఫై లేదా బ్లూటూత్ ఉపయోగించిన తర్వాత అనుమానాస్పదంగా డబ్బులు విత్‌డ్రా అయినా, లేదా అకౌంట్‌లో అనధికార లావాదేవీలు కనిపించినా వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని సూచించారు.