ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగ అభివృద్ధికి విశాఖ మరో కీలక అడుగు వేయబోతోంది. ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ నిర్మించనున్న శాశ్వత క్యాంపస్‌కు శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరవుతారు.
రాష్ట్ర ప్రభుత్వం విశాఖ కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లోని 21.31 ఎకరాలను కాగ్నిజెంట్‌కు కేటాయించింది. ఈ విస్తీర్ణంలో మూడు దశల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, క్లౌడ్ సొల్యూషన్లు వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై దృష్టి పెట్టిన భారీ క్యాంపస్‌ను సంస్థ ఏర్పాటు చేయనుంది.
శాశ్వత క్యాంపస్ పూర్తయ్యే వరకు కార్యకలాపాలను కొనసాగించేందుకు రుషికొండలోని ఐటీ పార్క్ హిల్–2లో మహతి ఫిన్‌టెక్ భవనంలో తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వెయ్యి సీటింగ్ కెపాసిటీ కలిగిన ఈ తాత్కాలిక క్యాంపస్‌ను శుక్రవారమే మంత్రి లోకేష్ ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభంతో కాగ్నిజెంట్ విశాఖ కార్యకలాపాలు అధికారికంగా మొదలవుతాయి.
కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి మొత్తం రూ. 1,583 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి కాగా 8 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. క్యాంపస్ నిర్మాణం మూడు దశల్లో పూర్తవుతుంది 2029 నాటికి మొదటి దశ పూర్తయ్యి 3,000 ఉద్యోగాలు సృష్టించబడతాయి.అనంతర రెండో, మూడో దశల్లో ఉద్యోగాల సంఖ్యను 8,000కి తీసుకెళ్తారు.
విశాఖలో ఈ ఐటీ క్యాంపస్ స్థాపనతో నగరం దక్షిణ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక హబ్‌ల్లో ఒకటిగా మరింత బలపడుతుంది. రాష్ట్ర యువతకు నాణ్యమైన ఉద్యోగాలు, పైస్థాయి సాంకేతిక శిక్షణ అవకాశాలు లభించనున్నాయి.పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, కాగ్నిజెంట్ పెట్టుబడి విశాఖలో మరిన్ని గ్లోబల్ కంపెనీలను ఆకర్షించే అవకాశం పెంచుతోంది. శుక్రవారం జరిగే శంకుస్థాపన ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగానికి మరో కీలక మైలురాయిగా నిలవనుంది.