International oil news: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా రష్యా చమురు కంపెనీలపై విధించిన ఆంక్షలు గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌లో కలకలం రేపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత రిఫైనరీలు రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేశాయి.
విభిన్న రిఫైనరీలు రాస్‌నెఫ్ట్, లుకాయిల్ వంటి సంస్థలతో ఉన్న ప్రస్తుత ఒప్పందాలను సమీక్షిస్తున్నాయి. అమెరికా నవంబర్ 21 లోపు రష్యా సంస్థలతో ఉన్న లావాదేవీలు ముగించాలని గడువు పెట్టడంతో, కొత్త ఆర్డర్లు ఇవ్వకుండా తాత్కాలిక విరామం తీసుకోవడం తప్పని పరిస్థితిగా మారింది.
ప్రస్తుతం భారత్ దిగుమతి చేసుకునే చమురులో దాదాపు మూడో వంతు రష్యా నుంచే వస్తుంది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ కంపెనీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఆంక్షల భయంతో ఇప్పుడు ఈ సంస్థలు తమ కొనుగోలు వ్యూహాన్ని పునఃపరిశీలిస్తున్నాయి.
ఇక మరోవైపు, ఇంధన భద్రత దృష్ట్యా భారత కంపెనీలు పశ్చిమాసియా దేశాలపై దృష్టి సారించాయి. ముఖ్యంగా ఇరాక్, సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి చమురు కొనుగోళ్లు పెరిగాయి. రిలయన్స్ ఇప్పటికే యూరోపియన్ మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యకలాపాలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
అదే సమయంలో, అమెరికా నుంచి చమురు దిగుమతులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. వాణిజ్య సమతౌల్యం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కూడా అమెరికా కంపెనీలతో ఒప్పందాలు పెంచాలని ప్రోత్సహిస్తోంది. ఈ నెలలో అమెరికా నుంచి దిగుమతులు 2022 తర్వాత గరిష్ఠ స్థాయికి చేరడం గమనార్హం.
మొత్తం మీద, రష్యాపై ఆంక్షల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పరిస్థితి స్థిరపడే వరకు భారత్ అమెరికా, పశ్చిమాసియా వైపు తాత్కాలిక వ్యూహం కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.