చైనా ప్రభుత్వం మరోసారి సోషల్ మీడియా నియంత్రణలో కఠిన చర్యలు చేపట్టింది. తాజాగా విడుదల చేసిన కొత్త మార్గదర్శకాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. వాటి ప్రకారం, ఇకపై చైనాలో “రీల్” లేదా షార్ట్ వీడియోలు చేయాలంటే డిగ్రీ తప్పనిసరి. ముఖ్యంగా మెడిసిన్ (Medicine), లా (Law), ఎడ్యుకేషన్ (Education), ఫైనాన్స్ (Finance) వంటి సున్నితమైన మరియు ప్రజలపై ప్రభావం చూపే అంశాలపై వీడియోలు చేయాలంటే ఆ వ్యక్తి ఆ రంగంలో అర్హత లేదా డిగ్రీ కలిగి ఉండాలి.
ఈ నిర్ణయం తీసుకున్న ఉద్దేశం తప్పుడు సమాచారం (Fake Information) మరియు మిస్లీడింగ్ కంటెంట్ వ్యాప్తిని అరికట్టడం. ఇటీవల చైనాలో సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా వైద్య సలహాలు, చట్టసంబంధ వీడియోలు, ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ గైడ్స్ పేరుతో అనేక తప్పుడు సమాచారాలు విస్తృతంగా పంచబడుతున్నాయని అధికారులు గుర్తించారు. ఆ వీడియోల కారణంగా ప్రజలు తప్పు నిర్ణయాలు తీసుకోవడం, మోసపోవడం వంటి ఘటనలు పెరుగుతుండటంతో ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది.
కొత్త నియమాల ప్రకారం, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ (Douyin, WeChat, Weibo) వంటి సంస్థలు తమ యూజర్లకు వీడియోలు పోస్ట్ చేసే ముందు వారి విద్యార్హతలను ధృవీకరించాలి. అంటే, ఒకరు “డాక్టర్” అంటూ మెడికల్ వీడియో చేస్తే, ఆయనకు నిజంగా మెడికల్ డిగ్రీ ఉందా లేదా అనేది ప్లాట్‌ఫార్మ్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఈ ధృవీకరణ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మాత్రమే ఆ వీడియోలను అప్లోడ్ చేయడానికి అనుమతి ఉంటుంది.
అదే విధంగా, నిబంధనలు ఉల్లంఘించినవారిపై తీవ్ర చర్యలు తీసుకోనున్నట్లు చైనా సైబర్ నియంత్రణ సంస్థ (Cyberspace Administration of China) ప్రకటించింది. సరైన అర్హతలు లేకుండా వీడియోలు చేసినవారి సోషల్ మీడియా ఖాతాలను తక్షణమే డిలీట్ చేయడం తో పాటు, సుమారు 12 లక్షల రూపాయల వరకు జరిమానా (సుమారు 100,000 యువాన్) విధించే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈ చర్యల వల్ల చైనా సోషల్ మీడియా వినియోగదారులపై పెద్ద ఎత్తున ప్రభావం చూపనుంది. ఇప్పటివరకు ఎవరికైనా రీల్స్ లేదా షార్ట్ వీడియోలు చేయడం సులభం కాగా, ఇకపై విద్యార్హత లేకుండా కొన్ని కేటగిరీల వీడియోలు చేయడం అసాధ్యం కానుంది.
చైనాలో ఈ నిర్ణయం కొంతమంది యువతలో నిరాశను కలిగించినా, చాలా మంది నెటిజన్లు మాత్రం దీనిని స్వాగతిస్తున్నారు. “తప్పుడు సలహాల వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. కనీసం ఇప్పుడు అయినా కంటెంట్ క్వాలిటీ మెరుగవుతుంది” అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా నిపుణులు చైనా చర్యను ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. ఇది కఠినమైన చర్య అయినప్పటికీ, ప్రజల భద్రతకు ఉపయోగపడవచ్చు. మొత్తానికి, చైనాలో రీల్స్ చేయాలంటే ఇప్పుడు డిగ్రీ తప్పనిసరి! సోషల్ మీడియాలో “సర్టిఫైడ్ క్రియేటర్స్ యుగం” ప్రారంభమైందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.