ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తన వాదనలో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది సుప్రీంకోర్టు గత తీర్పులకు వ్యతిరేకమని పేర్కొన్నారు. బీసీలకు కేటాయించిన 42 శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన ఈ పిటిషన్‌పై దేశవ్యాప్తంగా దృష్టి కేంద్రీకృతమైంది.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ఇప్పటికే విడుదల కావడంతో, ఈ కేసు తీర్పు కీలకమని భావిస్తున్నారు. రిజర్వేషన్ల శాతం తగ్గితే లేదా పెరిగితే ఎన్నికలపై నేరుగా ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక మరోవైపు, బీసీ రిజర్వేషన్ల అంశంపై మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు అక్టోబర్ 8న విచారణ జరపనుంది. ఈ రెండు కేసులు సమాంతరంగా నడవడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. తొలి రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారు. మిగతా మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోనే రిజర్వేషన్ల అంశం హైకోర్టు, సుప్రీంకోర్టు చుట్టూ తిరగడం ఎన్నికల ప్రక్రియను మరింత ఆసక్తికరంగా మార్చింది.
బీసీ ఓటు బ్యాంక్ కీలకమని భావిస్తున్న ప్రతి రాజకీయ పార్టీ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా రిజర్వేషన్ల వ్యవస్థలో మార్పులు వస్తే ఎన్నికల ఫలితాలపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక, హైకోర్టు – సుప్రీంకోర్టుల మధ్య న్యాయపరమైన చర్చలతో పాటు, రాజకీయ సమీకరణాలు కూడా ఈ ఎన్నికల పోరులో ఉత్కంఠను పెంచుతున్నాయి.