ఇటీవల ఆండ్రాయిడ్ వినియోగదారులు ఒక వింత అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఎలాంటి సెట్టింగ్స్ మార్చకుండానే తమ ఫోన్ డయలర్, కాల్ స్క్రీన్, నోటిఫికేషన్ డిస్‌ప్లే డిజైన్ పూర్తిగా మారిపోయిందని గమనించారు. ఉదయం లేచి కాల్ చేయడానికి ప్రయత్నిస్తే, మునుపటి రూపం కంటే భిన్నమైన ఇంటర్‌ఫేస్ కనిపించడంతో చాలామంది అయోమయంలో పడ్డారు.
ఈ మార్పు గురించి చాలామంది సోషల్ మీడియాలో ప్రశ్నించారు. “నా ఫోన్ హ్యాక్ అయిందా?” “ఎవరైనా రిమోట్‌గా సెట్టింగ్స్ మార్చారా?” “ఎందుకీ డిస్‌ప్లే ఒక్కసారిగా మారింది?” ఇలాంటి సందేహాలు, భయాలు పెద్ద సంఖ్యలో వ్యక్తమయ్యాయి. కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “మేము ఇష్టపడని మార్పులను బలవంతంగా ఎందుకు చేస్తున్నారు?” అని ప్రశ్నించారు.
నిజానికి, ఇది ఎటువంటి హ్యాకింగ్ సమస్య కాదు. ఇది గూగుల్ తీసుకొచ్చిన కొత్త అప్‌డేట్ వల్ల వచ్చిన మార్పు. “మెటీరియల్ 3D ఎక్స్‌ప్రెసివ్” అనే ఈ అప్‌డేట్‌ను గూగుల్ ఇప్పటికే 2025 మేలోనే ప్రకటించింది. గత కొన్నేళ్లలో వచ్చిన అతిపెద్ద అప్‌డేట్‌లలో ఇదొకటి అని కంపెనీ పేర్కొంది.
మునుపటి వరకు ఆండ్రాయిడ్ డిస్‌ప్లే మెటీరియల్ 3D అనే డిజైన్ ఆధారంగా పనిచేసేది. యూజర్లు దానికి అలవాటు పడి సౌకర్యంగా వాడుతుండగా, ఇప్పుడు దాన్ని మరింత ఆధునికంగా మార్చారు.
కొత్త కలర్ థీమ్‌లు, మరింత ఆకర్షణీయమైన నోటిఫికేషన్ డిస్‌ప్లే, వేగవంతమైన యానిమేషన్లు, అప్లికేషన్ల మధ్య స్మూత్ ట్రాన్సిషన్లు, జీమెయిల్, గూగుల్ ఫోటోలు, వాచ్ వంటి యాప్స్‌లో కొత్త లుక్స్ అందుబాటులోకి వచ్చాయి. మార్పు ఒక్కసారిగా రావడం వల్ల చాలామందికి అది ఆశ్చర్యంగా అనిపించింది. కొందరికి ఇది కొత్తదనంగా నచ్చింది. మరికొందరికి పాత డిస్‌ప్లే అలవాటు కావడంతో కొంత అసౌకర్యంగా అనిపిస్తోంది.
లాభం: ఇంటర్‌ఫేస్ మరింత స్పష్టంగా, వినియోగదారులకు సౌకర్యంగా ఉంటుంది. వేగం కూడా పెరుగుతుంది. నష్టాలు: కొత్త డిస్‌ప్లేకు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. పాత రూపం మిస్ అవుతున్నామన్న భావన కొందరిలో ఉంది. ఈ మార్పులు కేవలం ఆండ్రాయిడ్ ఫోన్‌లలోనే జరిగాయి. iOS (ఆపిల్ ఐఫోన్) వినియోగదారులకు ఈ అప్‌డేట్ వర్తించదు. అందువల్ల వారికి ఎలాంటి ఆందోళన అవసరం లేదు.
గూగుల్ తన అధికారిక ప్రకటనలో, “వినియోగదారులకు మరింత సులభతరం, వేగవంతం, ఆధునిక అనుభవం ఇవ్వడమే మా ఉద్దేశ్యం” అని తెలిపింది. “మునుపటి లాగే సెక్యూరిటీ, ప్రైవసీ విషయంలో ఎలాంటి రాజీ లేదని” గూగుల్ హామీ ఇచ్చింది.
సోషల్ మీడియాలో ఇప్పటికీ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు, “మాకు కొత్త అప్‌డేట్ చాలా బాగుంది, ఫోన్ స్మూత్‌గా ఉంది” అంటుంటే, మరికొందరు “మునుపటి డిస్‌ప్లేనే బెటర్, దాన్ని మళ్లీ ఆప్షన్‌గా ఇవ్వాలి” అంటున్నారు.
సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు సహజం. ప్రతి మార్పు మొదట్లో ఆశ్చర్యపరుస్తుంది, కానీ కాలక్రమంలో అది మన రోజువారీ జీవితంలో భాగమవుతుంది. ఆండ్రాయిడ్ వినియోగదారులు ప్రస్తుతం అనుభవిస్తున్న ఈ కొత్త మెటీరియల్ 3D ఎక్స్‌ప్రెసివ్ అప్‌డేట్ కూడా అలాంటి మార్పులలో ఒకటి.