ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రంలో రేషన్ కోసం తొలిసారి స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈసారి ఒకేసారి మొత్తం రాష్ట్రానికి కాకుండా, జిల్లాల వారీగా దశలవారీగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రేషన్ దారుల్లో కొత్త కార్డుల కోసం ఆసక్తి నెలకొంది.
ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, మొదటి విడతలో విజయనగరం, ఎన్టీఆర్, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఆగస్టు 25 నుంచి కార్డుల జారీ ప్రారంభమవుతుంది. రెండో విడతలో ఈ నెల 30వ తేదీ నుంచి చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో ఈ ప్రక్రియ మొదలుకానుంది.
మూడో విడతలో వచ్చే నెల 6వ తేదీ నుంచి అనంతపురం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది. చివరిగా నాలుగో విడతలో వచ్చే నెల 15వ తేదీ నుంచి బాపట్ల, పల్నాడు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం నాలుగు దశల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
గత ఏడాది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, రేషన్ కార్డుల జారీ ప్రక్రియను అనేకసార్లు వాయిదా వేసింది. దీని వెనుక కారణాలు ఈ-కేవైసీ పూర్తి కాకపోవడం, అనర్హుల తొలగింపు, డేటా పరిశీలన వంటివి. ఇప్పుడు అన్ని సమస్యలను అధిగమించి కొత్త కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది.
ఈసారి రేషన్ కార్డులను మరింత భద్రంగా చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రతి స్మార్ట్ కార్డులో క్యూ ఆర్ కోడ్‌ను నిక్షిప్తం చేయనుంది. దీని వలన డూప్లికేట్ కార్డులు తయారు చేయడం లేదా అక్రమాలకు వాడుకోవడం అసాధ్యం అవుతుందని అధికారులు చెబుతున్నారు. రేషన్ పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఇది కీలకంగా మారనుందని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. దీంతో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రజల్లో మరింత ఉత్సాహం నెలకొంది.