భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఆర్థిక రంగంలో మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు బంగారంపైనే తాకట్టు రుణాలు లభ్యమయ్యే పరిస్థితి ఉండగా, ఇకపై వెండిపైనా రుణాలు పొందే అవకాశం కల్పించింది. దేశీయ మార్కెట్‌లో వెండి ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం ప్రజలకు, ముఖ్యంగా చిన్న వ్యాపారులకు, ఆభరణాల వ్యాపారులకు, ఆర్థిక అవసరాలున్న కుటుంబాలకు ఉపశమనం కలిగించనుంది. ఆర్బీఐ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఆర్బీఐ సూచనల ప్రకారం, వాణిజ్య బ్యాంకులు మరియు బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థలు (NBFCs) ఇకపై వెండి నగలు, ఆభరణాలు, కాయిన్స్ వంటి వాటిని తాకట్టు పెట్టుకుని రుణాలు మంజూరు చేయవచ్చు. అంటే, బంగారంపై రుణాలు తీసుకున్నట్లే, ఇప్పుడు వెండి ఆధారంగా కూడా రుణ సదుపాయం లభిస్తుంది. అయితే ఈ పథకం వెండి కడ్డీలు (Silver Bars), ETFs (Exchange Traded Funds)కు వర్తించదని స్పష్టం చేసింది. ఒక వ్యక్తి గరిష్టంగా 10 కేజీల వరకు వెండిని తాకట్టు పెట్టి రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. అలాగే 500 గ్రాముల లోపు ఉన్న సిల్వర్ కాయిన్స్‌ను కూడా తాకట్టు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చింది.
రుణ పరిమాణం పూర్తిగా వెండి ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా నిర్ణయించబడుతుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో వెండి ధర కేజీకి రూ.1.70 లక్షల వద్ద ఉంది. కొద్ది నెలల క్రితం వెండి ధర రూ.2 లక్షల మార్క్ దాటిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో వెండి ఆధారంగా రుణాల సదుపాయం అనేకమందికి ఆర్థిక సౌలభ్యాన్ని కల్పిస్తుంది. ముఖ్యంగా నగదు ప్రవాహ సమస్యలు ఎదుర్కొంటున్న చిన్న వ్యాపారులు, జ్యువెలర్స్, స్వయం ఉపాధి వృత్తిదారులు దీనివల్ల లబ్ధి పొందే అవకాశం ఉంది.
వెండి ధరలు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా వెండి వినియోగం కేవలం ఆభరణాల రంగంలోనే కాకుండా పారిశ్రామిక రంగాల్లో కూడా విస్తృతంగా పెరిగింది. సోలార్ ప్యానెల్స్, విద్యుత్ బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కండక్టర్లు, వైద్య పరికరాలు, నీటి శుద్ధి పరికరాలు, ఫోటోగ్రఫీ తదితర రంగాల్లో వెండి వినియోగం భారీగా పెరుగుతోంది. ఈ పెరుగుదల వల్ల వెండి మార్కెట్ విలువ గణనీయంగా పెరిగింది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వెండి మార్కెట్ స్థిరీకరణకు తోడ్పడటమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థలో కొత్త పెట్టుబడి అవకాశాలను సృష్టించనుంది.