డ్వాక్రా మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పొదుపు సంఘాలు, స్వయం సహాయక సంఘాల కోసం ‘మన డబ్బులు – మన లెక్కలు’ అనే కొత్త యాప్‌ను విడుదల చేసింది. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం ఇప్పటికే సున్నా వడ్డీకే రుణాలు అందిస్తోంది. ఈ రుణాలను వాయిదా పద్ధతిలో చెల్లించే సమయంలో కొన్నిచోట్ల అవకతవకలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ సమస్యల నివారణ కోసం ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ యాప్‌లో ప్రతి సభ్యురాలి వివరాలు నమోదు చేసి వారికి ప్రత్యేక ఐడీ కేటాయిస్తారు. రుణ వాయిదాలు, పొదుపు డబ్బులు బ్యాంకులో జమ చేసినప్పుడు వెలుగు సిబ్బంది ఆ వివరాలను యాప్‌లో అప్‌డేట్ చేస్తారు. సమావేశాల సమయంలో యాప్‌లోని సమాచారం సభ్యులందరికీ స్పష్టంగా చెప్పబడుతుంది. దీంతో ఎలాంటి అక్రమాలకు తావు ఉండదని అధికారులు తెలిపారు.
మరోవైపు ఈ యాప్ సాయంతో డ్వాక్రా సంఘాల లావాదేవీలను ప్రతి సభ్యురాలు తానే తనిఖీ చేసుకోవచ్చు. రుణాలు ఎప్పుడు చెల్లించారో, పొదుపు ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో లేదో చూసుకోవచ్చు. దీంతో లెక్కలలో పొరపాట్లు ఉండవని, మహిళల మధ్య గొడవలు తగ్గుతాయని అధికారులు అంటున్నారు.