ఒక భారతీయ అభ్యర్థి ఫ్రాన్స్‌కు వ్యాపార సమావేశం కోసం వెళ్లడానికి చేసిన షెంగెన్ వీసా ప్రయత్నం రెండుసార్లు విఫలమైంది. ఈ అభ్యర్థి తన అనుభవాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ రెడిట్‌లో పంచుకున్నారు. మొదటి సారి సమర్పించిన పత్రాలు సరైన విధంగా లేకపోవడం వల్ల వీసా తిరస్కరించబడిందని చెప్పారు. ఆ సమయంలో ఒక ట్రావెల్ ఏజెన్సీ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
రెండవసారి స్వయంగా దరఖాస్తు చేసుకుంటూ అన్ని పత్రాలను సక్రమంగా సమర్పించారని, గత తిరస్కరణలో పేర్కొన్న లోపాలను సరిచేసుకున్నారని తెలిపారు. అయినప్పటికీ వీసా మళ్లీ నిరాకరించబడింది.
తిరస్కరణకు కారణాలను వివరించిన అభ్యర్థి, “వీసా మంజూరుకు సంబంధించి నా ప్రయాణ ఉద్దేశ్యం మరియు దేశంలో ఉండే ఉద్దేశం నమ్మదగినదిగా అనిపించలేదని, అలాగే వీసా గడువు ముగిసిన తర్వాత నేను తిరిగి వస్తాననే అంశంపై అనుమానం వ్యక్తమైందని” పేర్కొన్నారు.
ఈ అనుభవం తమ భవిష్యత్తు వీసా దరఖాస్తులపై ప్రతికూల ప్రభావం చూపుతుందేమోనన్న ఆందోళన కూడా ఆయన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ తిరస్కరణను సవాలు చేసే విధంగా అప్పీల్ చేయాలా లేదా అన్న విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
రెడిట్‌లో మరో వినియోగదారు స్పందిస్తూ, “నువ్వు ఎంబసీకి అప్పీల్ చేయాలనుకుంటున్నావా లేక ఫ్రాన్స్‌లోని నాంట్స్ కమిషన్‌కా? ప్రయత్నించడం తప్పు కాదు, తిరిగి తిరస్కరిస్తే కూడా పెద్ద నష్టం ఏమీ లేదు” అని వ్యాఖ్యానించారు.
అయితే మరొక వినియోగదారు హెచ్చరిస్తూ, “ ఇప్పుడు అప్పీల్ చేయడం వృథా. గత ఈవెంట్ కోసం అప్పీల్ చేయడం వీసా అధికారుల దృష్టిలో ప్రతికూలంగా ఉంటుంది. అదీ కాక వీసా వివరాలు అన్ని దేశాల మధ్య పంచుకునే కేంద్రీకృత డేటాబేస్‌లో ఉంటాయి” అని అన్నారు.
ఇంకొకరు సూచిస్తూ, “బిజినెస్ వీసా సాధారణంగా టూరిస్ట్ వీసా కంటే సులభంగా లభిస్తుంది. భవిష్యత్తులో టూరిస్ట్ వీసా దరఖాస్తు చేస్తే మరింత బలమైన పత్రాలు, స్పష్టమైన ప్రయాణ ప్రణాళిక అవసరం” అని చెప్పారు.
ఆ అభ్యర్థి ప్రస్తుతం మళ్లీ దరఖాస్తు చేయడంలో తొందర చూపడం లేదని, కానీ గత తిరస్కరణల ప్రభావం భవిష్యత్తు వీసా దరఖాస్తులపై పడకూడదనే ఉద్దేశంతో అప్పీల్ చేయాలా అనే ఆలోచనలో ఉన్నారని తెలిపారు.
రెడిట్ వినియోగదారులు సూచించినదేమిటంటే, భవిష్యత్తులో వీసా దరఖాస్తు చేసుకునే ముందు స్పష్టమైన ప్రయాణ ప్రణాళిక, సరైన పత్రాలు, వీసా ఉద్దేశం గురించి విశ్వసనీయ వివరణ ఇవ్వడం చాలా ముఖ్యం అని. లేదంటే వీసా తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఎక్కువ అని వివరించారు.