పర్యాటక వీసా నిబంధనలు ఉల్లంఘించిన లండన్ పరిశోధకురాలికి భారత్‌లో నో ఎంట్రీ, లండన్‌కు చెందిన విద్యావేత్త మరియు పరిశోధకురాలు ఫ్రాన్సెస్కా ఓర్సిని కి భారత ప్రభుత్వం ప్రవేశం నిరాకరించింది. ఆమె సోమవారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడే ఇమిగ్రేషన్ అధికారులు దేశంలోకి రానీయకుండా తిరిగి పంపించారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ సంవత్సరం మార్చిలోనే ఆమెను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చారు. కారణం ఆమె గతంలో పర్యాటక వీసాతో భారత్‌కి వచ్చి వీసా నిబంధనలకు విరుద్ధంగా పరిశోధనా కార్యకలాపాలు నిర్వహించడం.
ఫ్రాన్సెస్కా ఓర్సిని లండన్‌లోని స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్ కల్చర్స్ అండ్ లింగ్విస్టిక్స్ లో హిందీ మరియు దక్షిణాసియా సాహిత్యంలో ప్రొఫెసర్ ఎమెరిటాగా పనిచేస్తున్నారు. ఆమె హిందీ ఉర్దూ భాషల సాహిత్య చరిత్రపై విస్తృతంగా పరిశోధనలు చేశారు. ముఖ్యంగా దక్షిణాసియా ప్రాంతంలో బహుభాషా సాహిత్య సాంస్కృతిక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడంలో ఆమె పరిశోధన కొనసాగుతోంది.
ఓర్సిని ఇటీవల హాంకాంగ్ నుండి ఢిల్లీకి చేరుకున్నప్పుడే ఇమిగ్రేషన్ అధికారులు ఆమెను ఆపి తిరిగి పంపించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆమె పర్యాటక వీసా నిబంధనలను ఉల్లంఘించి భారతదేశంలో పరిశోధనా ప్రాజెక్టులు చేపట్టారని తేలింది.
ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపిన ప్రకారం పర్యాటక వీసాతో భారత్‌కి వచ్చే వ్యక్తులు పరిశోధన చేయకూడదు. పరిశోధన కోసం రావాలంటే వారికి ప్రత్యేకమైన ఆర్ వీసా (Research Visa) ఉండాలి. ఓర్సిని వీసా షరతులను ఉల్లంఘించడంతో ఆమెపై చర్యలు తీసుకోవడం సాధారణ అంతర్జాతీయ పద్ధతే అని చెప్పారు.
ఏ దేశానికైనా తన భూభాగంలో విదేశీయులను అనుమతించాలా వద్దా అనే హక్కు ఉంటుంది. ఒకరు బ్లాక్‌లిస్ట్‌లో ఉన్నప్పుడు వారిని తిరస్కరించడానికి కారణం చెప్పాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కొందరు ప్రతిపక్ష నాయకులు మరియు ప్రముఖులు సోషల్ మీడియా వేదిక X పూర్వపు ట్విట్టర్ లో స్పందిస్తూ ఓర్సినికి కారణం చెప్పకుండానే దేశ ప్రవేశం నిరాకరించడం ప్రభుత్వ అసహనాన్ని చూపుతోందని విమర్శించారు. కొందరు దీన్ని ప్రభుత్వం భయంతో అనిశ్చితితో అజ్ఞానంతో వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు.
గత సంవత్సరం ఫిబ్రవరిలో యునైటెడ్ కింగ్‌డమ్ కు చెందిన మరో అకాడెమిక్ నితాషా కౌల్ ను కూడా బెంగళూరు విమానాశ్రయంలో ప్రవేశం నిరాకరించి తిరిగి పంపించారు. భారత ఏజెన్సీలు ఆమెపై ప్రో సెపరటిస్ట్ వ్యాఖ్యలు చేయడం కాశ్మీర్‌పై ఆంటి ఇండియా అభిప్రాయాలు వ్యక్తం చేయడం వంటి కారణాలతో లుకౌట్ సర్క్యులర్ జారీ చేశాయి. తరువాత ఆమె ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా హోదా కూడా రద్దు చేయబడింది.
భారతదేశంలో పరిశోధన చేయాలనుకునే విదేశీయులు తప్పనిసరిగా ఆర్ వీసా కోసం దరఖాస్తు చేయాలి. దరఖాస్తులో పరిశోధన విషయం భారత్‌లో సందర్శించబోయే ప్రాంతాల వివరాలు ఇంతకుముందు చేసిన భారత పర్యటనల వివరాలు భారత విశ్వవిద్యాలయం లేదా గుర్తింపు పొందిన సంస్థ నుండి పొందిన అనుబంధ పత్రం మరియు దేశంలో గడపబోయే కాలానికి అవసరమైన ఆర్థిక వనరుల ఆధారాలు ఉండాలి.
వీసా నిబంధనలు ఉల్లంఘించడం ఏ దేశంలోనైనా సీరియస్ తప్పిదంగా పరిగణించబడుతుంది. ఫ్రాన్సెస్కా ఓర్సినికి భారతదేశ ప్రవేశం నిరాకరించడం కూడా అదే సూత్రం ప్రకారం జరిగింది. భారత ప్రభుత్వం తన చట్టపరమైన హక్కును వినియోగించి పర్యాటక వీసాతో పరిశోధన చేయకూడదనే నియమాన్ని కచ్చితంగా అమలు చేసినట్లు ఈ ఘటన ద్వారా స్పష్టమవుతోంది.