గూగుల్ సంస్థ విశాఖపట్నంలో భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడంతో ఈ నగరం మళ్లీ దేశ, విదేశాల టెక్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే టెక్నాలజీ ప్రపంచం దృష్టి పడకముందే విశాఖపట్నం దేశ భద్రతా వ్యవస్థలో కీలక కేంద్రంగా ఎదిగింది. తూర్పు తీరంలోని వ్యూహాత్మక ప్రాధాన్యత కారణంగా అమెరికా, చైనా వంటి దేశాలు కూడా ఈ నగరంపై శాటిలైట్ల ద్వారా క్షణక్షణం నిఘా ఉంచుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు, రక్షణ సంస్థల ఏర్పాటు వల్ల విశాఖ ఇప్పుడు భారత రక్షణ వ్యవస్థకు అగ్రశ్రేణి కంచుకోటగా మారింది.
భారత నావికాదళానికి విశాఖపట్నం హృదయ భాగంలాంటిది. ఇక్కడి షిప్ బిల్డింగ్ సెంటర్ (SBC) అణు జలాంతర్గాముల నిర్మాణానికి ప్రధాన కేంద్రంగా మారింది. రష్యా సహకారంతో ఇప్పటికే ఐఎన్ఎస్ అరిహంత్, అరిఘాత్, అర్థిమాన్ అణు జలాంతర్గాములు ఇక్కడే నిర్మించారు. ప్రస్తుతం నాలుగో అణు జలాంతర్గామి తయారీ దశలో ఉంది. అంతేకాకుండా ‘ప్రాజెక్టు–77’ కింద మరో ఆరు ఆధునిక న్యూక్లియర్ సబ్‌మెరైన్ల నిర్మాణానికి కేంద్రం అనుమతిచ్చింది. ఈ ప్రాజెక్టు కింద తయారవుతున్న మొదటి జలాంతర్గామిని జర్మనీకి విక్రయించే రూ.50 వేల కోట్ల ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులు విశాఖను ప్రపంచ రక్షణ పరిశ్రమలో ప్రత్యేక స్థాయికి తీసుకెళ్తున్నాయి.
విశాఖకు సమీపంలోని రాంబిల్లి ప్రాంతంలో నావికాదళం సుమారు 5,000 ఎకరాల్లో ‘వర్ష’ పేరుతో ప్రత్యామ్నాయ నావల్ స్థావరాన్ని నిర్మిస్తోంది. ఇది పూర్తిగా భూగర్భ రహస్య స్థావరం (NAOB). ఇక్కడ నిలిపే అణు జలాంతర్గాములను శత్రుదేశాల శాటిలైట్లు కూడా గుర్తించలేవు. ఒకేసారి 12 న్యూక్లియర్ సబ్‌మెరైన్లను నిల్వ ఉంచే సామర్థ్యం ఈ స్థావరానికి ఉంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన రియాక్టర్లను సరఫరా చేయడానికి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) ను కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. భూమి కిందే ఈ స్థావరాన్ని నిర్మించడం దేశ భద్రతా పరంగా ఎంత గోప్యంగా పనిచేస్తున్నారనే దానికి నిదర్శనం.
గగనతలం దిశగా కూడా విశాఖపట్నం వ్యూహాత్మకంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం నేవీ ఆధీనంలో ఉన్న విశాఖ విమానాశ్రయం, భోగాపురంలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత పూర్తిగా ఐఎన్ఎస్ డేగా అవసరాలకు కేటాయించబడుతుంది. దీంతో ఇక్కడి నుంచి యుద్ధ విమానాల కార్యకలాపాలు మరింత పెరుగుతాయి. భీమిలి సమీపంలోని ఐఎన్ఎస్ కళింగను ‘అగ్నిప్రస్థ’ పేరుతో మిస్సైల్ పార్క్‌గా అభివృద్ధి చేశారు. ఇక్కడ ఆకాశ్, పృథ్వీ వంటి క్షిపణులను నిల్వ ఉంచుతున్నారు. డీఆర్‌డీఓ ఆధ్వర్యంలోని ఎన్‌ఎస్‌టీఎల్ (NSTL) కేంద్రం ఆధునికీకరణతో ‘వరుణాస్త్ర’ టోర్పెడోను స్వదేశీ సాంకేతికతతో ఇక్కడే అభివృద్ధి చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏడాదిలో ఆరు సార్లు విశాఖ పర్యటించగా, ప్రధాని మోదీ కూడా నేవీ ప్రాజెక్టులను స్వయంగా సమీక్షించారు. కొవ్వాడలో అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కొనసాగుతుండటంతో, విశాఖ ఇప్పుడు పారిశ్రామిక నగరమే కాకుండా భారత రక్షణ రంగానికి తూర్పు తీరంలో అప్రతిహత కేంద్రంగా మారింది.