బ్యాంకు ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. డిపాజిట్ ఖాతాలు, సేఫ్టీ లాకర్లకు సంబంధించిన నామినేషన్ సౌకర్యాలలో కీలక మార్పులు తీసుకువచ్చింది. ఇప్పటి వరకు ఒకే వ్యక్తిని నామినీగా నియమించుకునే అవకాశం ఉండగా, ఇకపై గరిష్టంగా నలుగురిని నామినీలుగా ఎంచుకునే వీలుంటుంది. ఈ కొత్త నిబంధనలు నవంబర్ 1 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం అధికారికంగా ప్రకటించింది.
ఈ మార్పులు తాజాగా ఆమోదించిన బ్యాంకింగ్ చట్టాల (సవరణ) చట్టం–2025లో భాగంగా వచ్చాయి. దీని ప్రకారం, ఖాతాదారులు నామినీలను రెండు రకాలుగా నియమించుకోవచ్చు. ఒకేసారి నలుగురిని నామినీలుగా ఎంచుకోవచ్చు లేదా ఒకరి తర్వాత మరొకరికి ప్రయోజనం అందే విధంగా క్రమపద్ధతిలో నియమించుకోవచ్చు. దీంతో ఖాతా యజమానులు తమకు అనుకూలమైన విధానాన్ని ఎంచుకునే స్వేచ్ఛ పొందారు. అయితే బ్యాంకు సేఫ్టీ లాకర్లు, సేఫ్ కస్టడీ వస్తువులు విషయంలో మాత్రం “ఒకరి తర్వాత మరొకరు” అనే పద్ధతి యథావిధిగా కొనసాగుతుంది.
ఇకపై నామినీ నియామకంలో పారదర్శకత మరింత పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నలుగురిని నామినీలుగా ఎంచుకున్నప్పుడు, ఎవరికి ఎంత శాతం వాటా ఇవ్వాలనే అంశాన్ని ఖాతాదారులే నిర్ణయించవచ్చు. మొత్తం వాటాలు 100 శాతం కలిపి ఉండేలా కస్టమర్ ముందుగానే నిర్దేశించవచ్చు. ఉదాహరణకు, ఒక నామినీకి 40%, మరొకరికి 30%, మిగిలిన వారికి 20% చొప్పున వాటా కేటాయించవచ్చు. దీంతో భవిష్యత్తులో క్లెయిమ్ సెటిల్‌మెంట్లు వేగంగా, తగాదాలు లేకుండా పూర్తవుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
ఈ నిర్ణయాల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడటం, వారసత్వ హక్కుల విషయంలో స్పష్టతను కల్పించడం. ఇప్పటివరకు ఒకే నామినీ ఉన్న సందర్భాల్లో, ఆ వ్యక్తి లేకపోతే క్లెయిమ్ ప్రక్రియలో ఆలస్యం జరుగుతుండేది. కానీ కొత్త విధానంతో అటువంటి సమస్యలు తలెత్తవు. కేంద్ర ఆర్థిక శాఖ ఈ నిబంధనలను అన్ని బ్యాంకుల్లో సమానంగా అమలు చేయాలని ఆదేశించింది. ఇందుకోసం “బ్యాంకింగ్ కంపెనీల (నామినేషన్) నిబంధనలు–2025” పేరుతో కొత్త ఫారాలను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మార్పులు దేశవ్యాప్తంగా కోట్లాది బ్యాంకు కస్టమర్లకు ఉపశమనం కలిగించనున్నాయి.