భారత ప్రభుత్వ గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన సర్వే నివేదిక తెలుగు రాష్ట్రాల ఆర్థిక వాస్తవాన్ని బహిర్గతం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 43.7% మంది ప్రజలు అప్పుల్లో చిక్కుకున్నారని, తెలంగాణలో 37.2% మంది అప్పుల బారిన పడినట్లు ఈ నివేదిక వెల్లడించింది. అంటే రెండు రాష్ట్రాల దాదాపు సగం జనాభా అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టే. ఈ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో, తెలంగాణ రెండో స్థానంలో నిలిచాయి. అప్పుల భారంతో జీవన ప్రమాణం తగ్గుతున్నప్పటికీ, ప్రజలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ మంచి పురోగతి సాధించింది.
ఆంధ్రప్రదేశ్‌లో 15 ఏళ్లకు పైబడిన వారిలో 92.3% మంది ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలోకి వచ్చారు. అంటే బ్యాంక్ ఖాతాలు, బీమా, పెట్టుబడులు వంటి ఆర్థిక సేవలను వినియోగిస్తున్నవారు ఎక్కువమంది ఉన్నారన్న మాట. కర్ణాటక రాష్ట్రం 95.9%తో దేశంలో ముందంజలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. కానీ ఇదే కర్ణాటకలో అప్పుల్లో ఉన్నవారి శాతం కేవలం 23.2% మాత్రమే. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్యాంకింగ్ సేవలను బాగా వినియోగిస్తున్నప్పటికీ, అప్పు భారాన్ని కూడా ఎక్కువగా భరిస్తున్నారని స్పష్టమవుతోంది.
ఇక తెలంగాణ విషయానికి వస్తే, అక్కడ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ 86.5% మాత్రమే ఉంది. ఈ ర్యాంకింగ్లో తెలంగాణ దేశవ్యాప్తంగా 14వ స్థానంలో నిలిచింది. దక్షిణాది రాష్ట్రాల సగటు చూస్తే, 92.1% మంది ఆర్థిక సేవలు పొందుతున్నప్పటికీ, 31.8% మంది అప్పుల భారాన్ని మోస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి మెరుగ్గా ఉంది. అక్కడ 80.2% మంది బ్యాంకింగ్ సేవల్లో ఉన్నా, కేవలం 7.4% మందికే అప్పుల భారం ఉంది.
జాతీయ స్థాయిలో చూస్తే, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ హిందువుల్లో 88.1%, ముస్లింలలో 80.8%గా ఉంది. పురుషులు (89.8%) మహిళలకంటే (84.5%) ముందున్నారు. అప్పుల ఊబిలో ఎక్కువగా ఓబీసీ వర్గాలవారు (16.6%) ఉండగా, గిరిజనులు తక్కువ శాతం (11%) మాత్రమే అప్పులు చేశారు. కుటుంబ పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, పెద్ద కుటుంబాలకంటే చిన్న కుటుంబాలపై అప్పుల భారం ఎక్కువగా ఉందని సర్వే తేల్చింది. మొత్తానికి, తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆర్థికంగా చైతన్యంగా ఉన్నప్పటికీ, అప్పుల భారంతో ఇబ్బందులు పడుతున్నారన్నది ఈ నివేదిక స్పష్టం చేసింది.