AP Transport authority: మొంథా తుఫాన్ ముప్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు శాఖలను అలర్ట్‌లో ఉంచగా, ఏపీ రోడ్డు రవాణా సంస్థ (APSRTC) కూడా ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రయాణికుల భద్రతకే ప్రాధాన్యత ఇస్తూ ఆర్టీసీ మేనేజ్‌మెంట్ తాత్కాలిక మార్పులు అమలు చేయనుంది.
మండలాల నుంచి జిల్లాల వరకు ముంపు చెరువుల పొంగిపోవడం వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున, బలమైన గాలులు, వర్షాలు పడే మార్గాల్లో బస్సు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు.
ప్రయాణికుల రద్దీ ఉన్న చోట్ల మాత్రమే బస్సులు నడపాలి. అవసరం లేని రూట్లలో వాహనాలను నిలిపివేయాలి. పరిస్థితి సాధారణం అయ్యే వరకు భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో తెలియజేయడం జరిగినది.
దూరప్రాంతాలకు వెళ్లే సర్వీసుల విషయంలోనూ ఆర్టీసీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుందని. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటే ఆ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేయాలని, రిజర్వేషన్ చేసుకున్న వారికి ముందుగానే సమాచారం ఇవ్వాలని నిర్ణయించింది. బస్సు రద్దు వివరాలను బస్‌స్టేషన్లలో బోర్డులపై ప్రదర్శించాలనీ, మైక్ ప్రకటనల ద్వారా ప్రయాణికులకు తెలియజేయాలనీ సూచించారు.
వర్షపు నీరు చేరే అవకాశం ఉన్న డిపోల్లో బస్సులను ఎత్తైన ప్రదేశాలకు తరలించాలనే ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో 24 గంటలు పనిచేసే సమాచారం కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కేంద్రాలు రద్దయిన సర్వీసులు, ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రజలకు తాజా సమాచారం అందిస్తాయి.
ప్రతి జిల్లాలోని ఆర్టీసీ అధికారులు స్థానిక పోలీస్, రెవెన్యూ, రైల్వే అధికారులతో సమన్వయంగా పని చేయాలని ఎండీ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో రక్షణ చర్యలు త్వరగా చేపట్టేందుకు టీమ్‌లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
తుఫాన్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో అవసరం లేని ప్రయాణాలు మానుకోవాలని, బస్సు సర్వీసు వివరాలు తెలుసుకున్న తర్వాతే బయలుదేరాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రత మాకు ముఖ్యమైనది. పరిస్థితులు సాధారణం అయ్యేవరకు జాగ్రత్తగా ఉండండి అని ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు