AP Building Permission: ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణ రంగంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇకపై ఎవరు అనుమతులు లేకుండా భవనాలు కడితే అవి ఎన్ని అంతస్తులైనా కూల్చడమే అని తేల్చి చెప్పింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అన్ని నగరాలు, పట్టణాలకు తాజా ఆదేశాలు జారీ చేసింది.
స్పష్టంగా చెప్పాలంటే 2025 ఆగస్టు 31 తర్వాత అనుమతి లేకుండా ఎవరైనా భవనాలు కట్టినా వాటిని చట్టబద్ధం చేసే మార్గం లేదని ప్రభుత్వం తేల్చేసింది. బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం) కింద కూడా ఇక రాయితీలు ఉండవని తెలిపారు.
పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ పేర్కొన్నట్లు ప్రతి పట్టణ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారి తమ పరిధిలో ఉన్న అనధికార నిర్మాణాలను గుర్తించి, వాటి వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో అప్‌లోడ్ చేయాలి సూచనలు ఇవ్వడం జరిగినది.
ప్రభుత్వం ఈసారి ఆధునిక పద్ధతులు తీసుకొచ్చింది ప్రతి నిర్మాణానికి జీపీఎస్ లొకేషన్, తేదీతో కూడిన వీడియో, ఫోటో ఆధారాలు తప్పనిసరిగా సేకరించాలని సూచించింది. ఈ ఆధారాల ద్వారా కట్‌ఆఫ్ తేదీ తర్వాత నిర్మాణం జరిగిందా లేదా తేలుస్తారు.
ఇకపైనా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలే తప్పవని హెచ్చరిక జారీ అయింది. ఈసారి కూల్చేయాలి అన్న మాట కేవలం పేపర్ ఆదేశం కాదు, అమలు దశలోకి వెళ్లే ప్రక్రియగా మారిందని అధికారులు చెబుతున్నారు.
ఇక మరోవైపు ప్రజలకు కొంత ఊరట. లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS) దరఖాస్తు గడువును ప్రభుత్వం మూడు నెలలు పొడిగించింది. ఇప్పటివరకు 40,000కు పైగా దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
కొత్త గడువు 2026 జనవరి 23 వరకు అమల్లో ఉంటుంది. ప్రజల విజ్ఞప్తులతో పాటు రియల్ ఎస్టేట్ సంఘాలు చేసిన ప్రతిపాదనల ఆధారంగా ఈ పొడిగింపు మంజూరు చేసినట్లు పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించింది.
ఇకపై ఎవరికీ చట్టానికి మించిన హక్కులు ఉండవు అని ఈ నిర్ణయం స్పష్టం చేస్తోంది. పట్టణాభివృద్ధి నిబంధనలు కచ్చితంగా పాటించేలా భవిష్యత్తులో నగరాల రూపురేఖలు సక్రమంగా ఉండేలా ఈ చర్యలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది.పట్టణ అభివృద్ధి అంటే కేవలం భవనాలు కాదు, నిబంధనలపైనే నిజమైన ప్రగతి ఆధారపడి ఉంటుంది.