నటుడు మోహన్‌బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ మధ్యకాలంలో తమ ఇద్దరి కొడుకుల సమస్య వల్ల మంచు కుటుంబం వార్తల్లో నిలిచారు. అయితే ఇప్పుడు మోహన్‌బాబు మరో కారణంతో హాట్ టాపిక్ అయ్యారు అది ఆయన ఏర్పాటు చేసిన యూనివర్సిటీ గురించే.
2022లో తిరుపతి జిల్లా రంగంపేటలో మోహన్‌బాబు గారు శ్రీవిద్యానికేతన్ యూనివర్సిటీ ని స్థాపించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అది మోహన్‌బాబు యూనివర్సిటీ (MBU) పేరుతో కొనసాగుతోంది. ఇక్కడ ఇంజినీరింగ్, గ్రీన్‌ఫీల్డ్, ఇంకా ఇతర కోర్సులు అందిస్తున్నారు. ఈ కళాశాలలో కొంతమంది విద్యార్థుల సీట్లు ప్రభుత్వ కోటా కింద ఉంటాయి. ఆ కోటా సీట్ల ఫీజులను ఉన్నత విద్యామండలి (HEC)నిర్ణయిస్తుంది.
అసలైన విషయం ఏంటంటే—2022-23 విద్యా సంవత్సరం నుంచి 2023 సెప్టెంబర్ 30 వరకు, ఈ యూనివర్సిటీ ప్రభుత్వం నిర్ణయించిన రేటు కంటే అదనంగా రూ.26.17 కోట్లు ఫీజులు వసూలు చేసిందని ఆరోపణలు వచ్చాయి. డే స్కాలర్ విద్యార్థుల దగ్గర కూడా మెస్ ఛార్జీలు వసూలు చేయడం హాజరు తక్కువగా ఉందని అదనపు ఫీజులు వేయడం వంటి అంశాలు బయటపడ్డాయి. ఈ విషయాన్ని AP Parents Association బయట పెట్టింది.
దీంతో HEC ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపింది. ఆ విచారణలో యూనివర్సిటీ ఆర్థిక వివరాల్లో అవకతవకలు హాజరు రికార్డుల్లో తేడాలు, విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వకుండా ఉంచడం వంటి అంశాలు బయటపడ్డాయి. చివరగా కమిషన్, యూనివర్సిటీని 15 రోజుల్లో రూ.26.17 కోట్లు విద్యార్థులకు తిరిగి చెల్లించమని అలాగే రూ.15 లక్షల జరిమానా చెల్లించమని ఆదేశించింది.
అయితే యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం తమ వాదనను ముందుకు తెచ్చింది. విద్యార్థులు స్వచ్ఛందంగానే అదనపు ఫీజులు చెల్లించారని ఎవరినీ బలవంతం చేయలేదని చెబుతున్నారు. కానీ కమిషన్ ఆ వాదనను తిరస్కరించి, నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేశారని స్పష్టం చేసింది.
ఇది అంతటితో ఆగలేదు. MBU యాజమాన్యం ఈ ఆదేశాలను హైకోర్టులో సవాలు చేసింది ఈ కేసులో కోర్టు 2024 సెప్టెంబర్ 26న మూడు వారాల తాత్కాలిక స్టే ఇచ్చింది. తదుపరి విచారణను 2025 అక్టోబర్ 14కి వాయిదా వేసింది. ఇప్పుడు ఈ వ్యవహారం మళ్లీ అందరి దృష్టిని మోహన్‌బాబు యూనివర్సిటీ వైపు తిప్పింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధికారులు అందరూ ఈ కేసు తుది తీర్పు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ పరిణామాలతో మోహన్‌బాబు యూనివర్సిటీ భవిష్యత్తు ఏ దిశగా వెళుతుందో చూడాలి.