దేశంలో అగ్రగామి ఐటీ సర్వీసుల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) భారీ స్థాయిలో లేఆఫ్స్ ప్రకటించడం ఉద్యోగులకు గట్టి షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాదికల్లా తమ మొత్తం ఉద్యోగుల్లో సుమారు 2 శాతం (దాదాపు 12,200 మంది)ని ఉద్యోగాల నుంచి తప్పించనున్నట్లు వెల్లడించింది.
అయితే, ఇదే సమయంలో మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) మాత్రం ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 20 వేల మంది కొత్త కాలేజ్ గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ సీఈఓ సలీల్ పరేఖ్ ప్రకటించారు. ఓ జాతీయ మాధ్యమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ,
“మొదటి త్రైమాసికంలోనే 17 వేల మందికి పైగా నియమించుకున్నాం. 2025 నాటికి మరో 20 వేల కొత్త గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాలు కల్పించనున్నాం” అని తెలిపారు.
అలాగే, ఇన్ఫోసిస్ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగాలపై విస్తృత స్థాయిలో దృష్టి పెట్టిందని చెప్పారు. ఇప్పటి వరకు 2.75 లక్షల మందికి పైగా ఉద్యోగులకు డిజిటల్, ఏఐ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చామని, రాబోయే కాలంలో ఈ రంగాల్లో పెట్టుబడులను మరింత పెంచనున్నట్లు వివరించారు.