ఒక దశలో అమెరికాలో గృహాల కొనుగోలు ఒక ఉద్యమంలా మారింది. కోవిడ్-19 తర్వాత ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కల్చర్ వల్లే కాదు, ‘మూన్‌లైటింగ్’ (ఒకేసారి రెండు-మూడు ఉద్యోగాలు చేయడం) వల్ల కొన్ని వందల డాలర్లు అధికంగా సంపాదించిన ఉద్యోగులు భారీగా ఇళ్లను కొనుగోలు చేశారు. తామే నెలలకు ఎక్కువ సంపాదిస్తున్నామనే భావనతో వారు తనఖా రుణాలపై ఆధారపడి ఇళ్లను కొనుగోలు చేయడం ప్రారంభించారు.
అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టెక్ రంగంలో సంక్షోభం రావడం, ఉద్యోగ భద్రతపై అనిశ్చితి ఉండడంతో అప్పట్లో కొనుగోలు చేసిన ఇళ్లు ఇప్పుడు విక్రయానికి పెడుతున్నారు. చాలా మంది ఈఎంఐలు తట్టుకోలేకపోతున్నారు. ఉద్యోగం పోయిన తర్వాత రుణం చెల్లించలేక ఆస్తులను నిలుపుకోవడం కష్టంగా మారుతోంది.
అప్పట్లో 2% వడ్డీ రేటుతో ఇచ్చిన లోన్లు ఇప్పుడు 7% దాటాయి. ఎందుకంటే బ్యాంకులు అప్పట్లో "అడ్జస్టబుల్ మార్ట్‌గేజ్" పేరుతో మొదటి రెండు–మూడు సంవత్సరాల వరకు తక్కువ వడ్డీ, తర్వాత పెరిగేలా స్కీములు రూపొందించాయి. ఫలితంగా ఇప్పుడు భారీ వడ్డీల భారం మీదపడుతోంది.
దీనికి తోడు కుటుంబ, సామాజిక ఒత్తిడి కూడా ఉంది. “ఇల్లు కొనాలి” అనే అర్ధాంతర లక్ష్యంతో, తాహతు లేకుండానే మన భారతీయులు కొనుగోళ్లకు దూకేశారు. ఇతరులు కొన్నారు కాబట్టి నేనూ కొనాలనే ఆశ, కుటుంబ సభ్యుల ఒత్తిడి — ఇవన్నీ కలిసిపోవడంతో కొందరు తీవ్ర ఆర్థిక ఒత్తిడికి లోనవుతున్నారు.
ఇక కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువత కూడా ఫ్యాన్సీ కార్లు, ఖరీదైన గృహాలపై ఆసక్తి చూపుతున్నారు. మధ్యతరగతి ఆదాయ స్థాయిని అంచనా వేయకుండానే ఖరీదైన జీవితాన్ని కోరుతున్నారు. దీని ప్రభావం గృహరుణ రికవరీల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
ఇప్పుడు మళ్లీ ఆస్తులు అమ్మే వారు పెరుగుతున్నారు, కానీ కొనుగోలు చేసే వారు కనిపించడం లేదు. రుణ సంస్థలు కూడా గతంలోలా ఉదారంగా ఉండటం లేదు. ప్రత్యేకించి H-1B వీసా ఉన్నవారికి రుణాలు ఇచ్చేముందు వారి ఉద్యోగ స్థిరత్వాన్ని పూర్తిగా అంచనా వేస్తున్నాయి.
అమెరికాలో పరిస్థితి డోలాయమానంగా మారినప్పటికీ, భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ మాత్రం మితమైన స్థిరత్వాన్ని కలిగి ఉంది. అందుకే ఆచితూచి పెట్టుబడులు పెట్టే ముందు సమగ్రమైన ఆలోచన అవసరం. విదేశాల్లో సంపాదించిన డబ్బును స్వదేశంలో పెట్టుబడిగా మలచడం కొంత మేలుగా నిలవొచ్చు.