కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ విషయంలో పరిణామం చోటు చేసుకుంది. యెమెన్ ప్రభుత్వం ఆమెకు విధించిన మరణ శిక్షను రద్దు చేసినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని భారత గ్రాండ్ ముఫ్తీ కాంతాపురం ఏపీ అబూబాకర్ ముస్లియార్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.
అయన కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, యెమెన్‌లోని విద్యావేత్తలు, ఉన్నతాధికారులు, దౌత్యవేత్తలు కలిసి నిర్వహించిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మరణశిక్షను రద్దు చేయాలన్న నిర్ణయం తీసుకున్నప్పటికీ, దీనికి సంబంధించిన అధికారిక రాతపూర్వక ధృవీకరణ పత్రం రావాల్సి ఉందని పేర్కొన్నారు.
నిమిష ప్రియ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. విదేశాల్లో పని చేసే అనేకమంది నర్సులకు, మహిళా ఉద్యోగులకు ఇది ఉదాహరణగా నిలిచింది. యెమెన్‌లో పని చేస్తున్న సమయంలో నిమిష ప్రియపై నేరారోపణలు రావడంతో, ఆమెకు అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది.
ఈ నేపథ్యంలో, ఆమెకు మద్దతుగా సామాజిక వేదికలపై ప్రజలు గొంతెత్తగా, భారత ప్రభుత్వం, మతపరమైన ప్రముఖులు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహా పలువురు నేతలు దౌత్యపరంగా జోక్యం చేసుకున్నారు.
ఇప్పుడు ఈ శిక్షను రద్దు చేయడం ఆమె కుటుంబానికి, మానవ హక్కుల కార్యకర్తలకు, దేశ ప్రజలకు పెద్ద ఊరట కలిగిస్తోంది. అధికారిక ధ్రువీకరణ వచ్చిన తర్వాత ఆమెకు పూర్తి విముక్తి లభించే అవకాశం ఉంది.