తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. భూ వివాదానికి సంబంధించి నేరుగా సీఎం రేవంత్‌ను లక్ష్యంగా చేసుకున్న ఎన్.పెద్దిరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. అంతకుముందు ఈ కేసులో Telangana High Court కూడా పెద్దిరాజు పిటిషన్‌ను క్వాష్ చేస్తూ, రేవంత్‌పై ఎటువంటి నేర ఆధారాలు లేవని తేల్చింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన పెద్దిరాజు.. చివరికి అక్కడ కూడా నిరాశలోనే మిగిలాడు.
అంతేకాదు, పెద్దిరాజుతో పాటు ఆయన తరఫు న్యాయవాది రితేష్ పాటిల్‌కు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాది రితేష్ కోర్టును సమాధానపూర్వకంగా ఆశ్వస్తం చేయాల్సి ఉందని, అప్పుడే కేసును పరిగణనలోకి తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ధిక్కరణ కింద చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ ప్రశ్నించింది. తదుపరి విచారణ ఆగస్టు 11కి వాయిదా వేసింది.