ఇది ఐసీఐసీఐ ఖాతాదారులకు నిజంగా శుభవార్త. చెక్కుల క్లియరెన్స్ కోసం రోజుల తరబడి ఎదురుచూసే అవసరం ఇకపై ఉండదు. కస్టమర్ల సౌకర్యాన్ని, లావాదేవీల వేగాన్ని పెంచడానికి బ్యాంక్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఖాతాదారులు బ్యాంక్‌లో సమర్పించిన చెక్కులు ఒక్క వర్కింగ్ డేలోనే క్లియర్ అవుతాయి. అక్టోబర్ 4 నుండి ఈ కొత్త విధానం అధికారికంగా అమలులోకి వస్తుంది. ఇది బ్యాంకింగ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే దిశలో ఒక ముఖ్యమైన అడుగు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) దేశవ్యాప్తంగా చెక్కుల సెటిల్‌మెంట్ ప్రక్రియను వేగవంతం చేయడానికి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. అందుకే ఐసీఐసీఐ బ్యాంక్ కూడా తన విధానాన్ని నిరంతర క్లియరింగ్ వ్యవస్థకు మార్చుతోంది. ఇప్పటికే ఉన్న బ్యాచ్‌ల వారీ క్లియరింగ్ స్థానంలో, ఇప్పుడు చెక్కును సమర్పించిన కొన్ని గంటల్లోనే ఖాతాలో డబ్బు జమ అవుతుంది. దీనివల్ల ఖాతాదారులు వేచిచూడే సమయం గణనీయంగా తగ్గుతుంది, అలాగే వ్యాపారులకు, వ్యక్తిగత ఖాతాదారులకు నేచురల్ లిక్విడిటీని అందిస్తుంది.
అదనంగా, అధిక విలువ కలిగిన చెక్కుల భద్రత కోసం ‘పాజిటివ్ పే’ ఫీచర్ తప్పనిసరిగా ఉపయోగించాలని బ్యాంక్ సూచించింది. రూ. 50,000 పైగా విలువ కలిగిన చెక్కులకు వినియోగదారులు ముందుగానే ఆన్‌లైన్‌లో ధృవీకరణ చేయాలి. 5 లక్షల పైగా చెక్కులకు పాజిటివ్ పే తప్పనిసరి. లేకపోతే ఆ చెక్కులు తిరస్కరించబడే ప్రమాదం ఉంది. ధృవీకరించిన చెక్కులపై మాత్రమే ఆర్‌బీఐ వివాద పరిష్కార యంత్రాంగం వర్తిస్తుంది. ఇది మోసాలను అరికట్టడానికి ముఖ్యమైన చర్య.
కస్టమర్లకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంక్ సూచించింది. చెక్కుపై రాసిన అక్షరాలు, అంకెలు స్పష్టంగా ఉండాలి. తేదీ చెల్లుబాటులో ఉండాలి. లబ్ధిదారుడి పేరు లేదా మొత్తం వివరాల్లో ఎలాంటి మార్పులు, కొట్టివేతలు ఉండకూడదు. సంతకాలు బ్యాంకు రికార్డుతో సరిపోలడం తప్పనిసరి. అక్టోబర్ 4 నుంచి ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు చెక్కుల క్లియరెన్స్ జరుగుతుంది. ఈ విధానం ద్వారా ఖాతాదారులకు తక్షణ లావాదేవీల అనుభవం, అధిక భద్రతతో పాటు త్వరిత సేవ లభిస్తుంది.