భారీ వర్షాల కారణంగా భద్రాచలంలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద ప్రవాహం కారణంగా నీటిమట్టం వేగంగా పెరుగుతూ 43 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసి, నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరిలో 9,40,345 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. వరద ప్రభావంతో స్నానఘట్టాలు పూర్తిగా మునిగిపోయాయి. నీరు కళ్యాణకట్టను తాకడంతో భక్తులు స్నానాల కోసం నదిలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
ఇక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పర్ణశాలలోనూ వరద ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సీతమ్మ నారచీరల ప్రాంతం, సీతమ్మ విగ్రహం వరద నీటిలో మునిగిపోయాయి.
మరోవైపు తుంగభద్ర జలాశయానికి కూడా భారీ వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టుకు 1,28,453 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, అధికారులు 26 గేట్లను ఎత్తి 1,30,715 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి, తుంగభద్ర నదుల ఉద్ధృతి కొనసాగుతుండటంతో అధికారులు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.