ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల, చీరాల రైల్వే స్టేషన్లలో వందే భారత్ రైళ్లకు కొత్తగా హాల్టింగ్ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు స్టేషన్లలో రైళ్లు ఆగేలా చూడాలని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించి, దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఈపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం సికింద్రాబాద్–తిరుపతి, విజయవాడ–చెన్నై వందే భారత్ రైళ్లు బాపట్ల జిల్లా మీదుగా వెళ్తున్నప్పటికీ, ఎక్కడా ఆగడం లేదు. ప్రయాణికులు చాలా కాలంగా బాపట్ల, చీరాలలో హాల్టింగ్ కోసం డిమాండ్ చేస్తున్నారు. బాపట్లలో విద్యా కేంద్రాలు, జాతీయ స్థాయి పరిశోధన కేంద్రాలు ఉండగా, చీరాల ఒక ప్రముఖ వ్యాపార కేంద్రం కావడంతో ఈ రెండు పట్టణాలకు వందే భారత్ రైలు హాల్టింగ్ అవసరం ఉందని స్థానికులు చెబుతున్నారు.
బాపట్ల–చీరాల మధ్య దూరం కేవలం 18 కిలోమీటర్లే కావడంతో రెండు చోట్లా రైలు ఆగడం సాంకేతికంగా కష్టమని అధికారులు భావిస్తున్నా, ప్రయాణికుల అవసరాల దృష్ట్యా ఒక రైలును బాపట్లలో, మరొక రైలును చీరాలలో ఆపే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ మాత్రం రెండు స్టేషన్లలోనూ వందే భారత్ రైళ్లు ఆగుతాయనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.