అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కనే లక్షలాది మంది యువతకు పెద్ద షాక్ ఇచ్చారు. ఇప్పటివరకు H1B వీసా కోసం లాటరీ విధానం ద్వారా ఎంపిక చేసే పద్ధతి ఉండగా, దానిని పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై H1B వీసాకు దరఖాస్తు చేయాలనుకునే వారు లక్ష డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 89 లక్షల రూపాయలు) ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన సెప్టెంబర్ 21 అర్ధరాత్రి నుండి అమల్లోకి వస్తుంది.
ఈ నిర్ణయం ఇప్పటికే అమెరికాలో ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న అనేక మందిని ఆందోళనకు గురి చేసింది. ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులు, అమెరికాలో పనిచేయాలని కలలుకనే విద్యార్థులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. వీసా ఫీజు ఇంత భారీగా ఉండటం వల్ల సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వారికి ఇది దాదాపు అసాధ్యమవుతుంది. అంతేకాకుండా, ఇప్పటికే H1B వీసా కలిగిన వారు ప్రస్తుతం అమెరికా వెలుపల ఉంటే, వారు సెప్టెంబర్ 21, 2025 అర్ధరాత్రి (00:00 గంటలకు) లోపల అమెరికాలో ప్రవేశించాలని IT దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రత్యేకంగా సూచించింది. లేకపోతే, కొత్త ఆంక్షలు వారికీ వర్తించే అవకాశముందని హెచ్చరించింది.
ట్రంప్ ఈ నిర్ణయంపై ఐటీ రంగం ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లాటరీ పద్ధతిపై ఉన్న విమర్శలను దాటుకుని, మరింత కఠినంగా మారిన ఈ నిబంధనల వల్ల అమెరికాలో వర్క్ వీసా పొందడం కలగానే మిగిలిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం, వీసా ఖర్చులు పెరగడం, వలసదారులపై ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల అమెరికా ఐటీ పరిశ్రమకే నష్టం జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇకపోతే, ఈ కొత్త ఆంక్షలపై ఉద్యోగులు, వలసదారుల సంఘాలు ఇప్పటికే న్యాయస్థానాలను ఆశ్రయించే యోచనలో ఉన్నాయి. అమెరికాలో ఉన్న వందలాది ఐటీ ఉద్యోగులు, అలాగే భారతదేశం నుంచి వెళ్ళాలని కలలు కనే యువత ఈ నిర్ణయం వల్ల రోడ్డెక్కే పరిస్థితి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ తీసుకున్న ఈ కొత్త వీసా విధానం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ నిర్ణయం కొనసాగుతుందా లేదా కోర్టులు దానిని కొట్టివేస్తాయా అన్నది చూడాలి.