ఇప్పటి డిజిటల్ యుగంలో చిన్నారుల పెంపకం స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, ట్యాబ్లెట్‌ల చుట్టూ తిరుగుతోంది. తల్లిదండ్రులు బిజీ షెడ్యూల్స్ కారణంగా పిల్లల్ని అలరించేందుకు, వారిని తాత్కాలికంగా ప్రశాంతంగా ఉంచేందుకు మొబైల్ లేదా టీవీ స్క్రీన్‌ను అందించడం సాధారణంగా మారిపోయింది. కానీ తాజా పరిశోధనల ప్రకారం ఈ అలవాటు పిల్లల ఆరోగ్యానికి, ఎదుగుదలకు, మరియు మెదడు అభివృద్ధికి తీవ్రమైన ప్రమాదంగా మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శాస్త్రవేత్తల అధ్యయనాలు చెబుతున్నట్లు, రోజుకి రెండు గంటలకుపైగా స్క్రీన్ చూసే పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదల నెమ్మదిగా జరుగుతుంది. చిన్న పిల్లలలో కూర్చోవడం, నడవడం, మాట్లాడడం వంటి మైల్స్‌టోన్‌లు ఆలస్యమవుతున్నాయి. ముఖ్యంగా 2 సంవత్సరాల లోపు వయసు పిల్లలకు స్క్రీన్ ఎక్స్‌పోజర్ ఉన్నప్పుడు మెదడు వృద్ధిలో ఆటంకం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్, కృత్రిమ సౌండ్ ఎఫెక్ట్స్ చిన్నారుల మెదడుపై గందరగోళాన్ని సృష్టిస్తాయి.
అతి ఎక్కువ స్క్రీన్ టైమ్ వల్ల పిల్లల్లో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD), అటెన్షన్ డెఫిసిట్ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్ (ADHD) వంటి సమస్యలు పెరుగుతున్నాయి. పిల్లలు స్క్రీన్ మీద కదులుతున్న చిత్రాలకు అలవాటు పడిపోతారు, కానీ రియల్ లైఫ్‌లో అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతింటాయి, ఎమోషనల్ రెస్పాన్స్ తగ్గుతుంది. తల్లిదండ్రుల ముఖ కవళికలు, హావభావాలు అర్థం చేసుకునే సామర్థ్యం తగ్గడం వల్ల సామాజిక మెలకువలు నేర్చుకోవడంలో పిల్లలు వెనుకబడతారు.
మితిమీరిన స్క్రీన్ టైమ్ కారణంగా పిల్లలు బయట ఆడుకోవడం తగ్గిపోతుంది. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల బరువు పెరుగుదల, కంటి సమస్యలు, నిద్రలేమి, మరియు ఇమ్యూనిటీ లోపాలు వస్తున్నాయి. బ్లూ లైట్ కారణంగా స్లీప్ హార్మోన్ అయిన మెలటోనిన్ ఉత్పత్తి తగ్గి, నిద్ర పద్ధతి లోపిస్తుంది. చిన్న వయసులోనే కంటి దృష్టి బలహీనపడే ప్రమాదం కూడా ఉంది.
రెండు సంవత్సరాల లోపు పిల్లలకు మొబైల్ లేదా టీవీ చూపించకూడదు.
పెద్ద పిల్లలైతే రోజుకి గరిష్టంగా ఒక గంట మాత్రమే స్క్రీన్ టైమ్ అనుమతించాలి.
స్క్రీన్ కంటెంట్ ఎడ్యుకేషనల్ లేదా ఇంటరాక్టివ్‌గా ఉండాలి.
పిల్లలతో కూర్చొని మాట్లాడటం, ఆడుకోవడం, కథలు చెప్పడం వంటి సహజమైన ఇంటరాక్షన్‌లు పెంచాలి.
నిద్రకు ముందు కనీసం ఒక గంట ముందు నుంచి స్క్రీన్‌లను పూర్తిగా ఆపేయాలి.
పిల్లల చిన్న వయసు అనేది మెదడు రూపుదిద్దుకునే సమయం. ఆ సమయంలో స్క్రీన్ కంటే మనుషుల మధ్య కమ్యూనికేషన్‌నే ప్రధానంగా ఉంచితేనే పిల్లలు సమతుల్యమైన శారీరక, మానసిక ఎదుగుదల సాధిస్తారు. తల్లిదండ్రులు చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని స్క్రీన్ వినియోగాన్ని పరిమితం చేయడం అత్యంత అవసరం.