ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైల్వే వ్యవస్థ అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది. రాయలసీమ ప్రాంతం రైల్వే సదుపాయాల పరంగా మరింత పురోగతి సాధించేందుకు రైల్వే శాఖ పలు ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తోంది. తాజాగా కడప జిల్లాలోని పులివెందుల ప్రాంతానికి రైల్వే కనెక్టివిటీ ఇవ్వడానికి కేంద్ర రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో స్థానిక ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
పులివెందుల మీదుగా కడప-బెంగళూరు మార్గంలో కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి సన్నాహాలు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి. ముద్దనూరు, పులివెందుల, ముదిగుబ్బ, శ్రీ సత్యసాయి జిల్లాల మీదుగా సుమారు 110 కిలోమీటర్ల పొడవైన ఈ లైన్ నిర్మాణానికి రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు సుమారు ₹2,505.89 కోట్ల రూపాయల వ్యయం అంచనా వేయబడింది.
ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సిద్ధంగా ఉంది. దీని ఆమోదం వచ్చిన వెంటనే పనులు ప్రారంభించాలని రైల్వే అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లైన్ పూర్తి అయితే రాయలసీమ ప్రాంతంలోని పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడటంతో పాటు, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.
ఈ రైల్వే లైన్ మానవ రవాణాతో పాటు సరుకు రవాణాకి కూడా కీలక పాత్ర పోషించనుంది. కడప జిల్లాలోని ఉద్యాన పంటలు, బొగ్గు, ఖనిజ సంపద, సిమెంట్, స్టీల్ మరియు ఎలక్ట్రానిక్స్ కంపెనీల ఉత్పత్తుల రవాణాకు ఈ లైన్ ఎంతో ఉపయోగపడనుంది. దీంతో రాయలసీమ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అధికారులు ఆశిస్తున్నారు.
ఇక రాయలసీమలో పర్యాటక, పారిశ్రామిక రంగాల ప్రగతికి ఈ రైల్వే లైన్ తోడ్పడనుంది. ఓబులవారిపల్లె–గుంతకల్లు మధ్య కొత్త రైల్వే లైన్, అలాగే ఓబులవారిపల్లె–రేణిగుంట మధ్య మూడవ లైన్ నిర్మాణం కూడా పరిశీలనలో ఉంది. ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే రాయలసీమ రవాణా వ్యవస్థకు నూతన ఊపిరి లభిస్తుందని, పర్యాటక రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.