ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం వరుసగా పథకాలను ప్రారంభిస్తోంది. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, విదేశాల్లో పనిచేస్తున్న ఆంధ్రుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనలో భాగంగా “ప్రవాసాంధ్ర భరోసా పథకం”ను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా విదేశాల్లో పనిచేస్తున్న ఆంధ్ర ప్రజలకు భద్రత, బీమా, సహాయం అందించడమే ముఖ్య ఉద్దేశం.
ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఎన్‌ఆర్టీ సొసైటీ ద్వారా అమలు చేయనుంది. విదేశాలకు ఉద్యోగం కోసం, చదువుకోసం వెళ్లిన ఆంధ్రులకు ఈ పథకం ద్వారా ఆర్థిక భరోసా లభిస్తుంది. ఏపీ నుంచి వెళ్లిన కార్మికులు, విద్యార్థులు ఈ పథకంలో నమోదు చేసుకుంటే ప్రమాదం లేదా అంగవైకల్యం జరిగినప్పుడు ప్రభుత్వం నుండి సహాయం అందుతుంది.
ఈ పథకంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎవరి పేరుతో బీమా చేసారో, ఆ వ్యక్తి మరణించినా లేదా శాశ్వత వైకల్యం వచ్చినా వారికి ₹10 లక్షల వరకు ఆర్థిక సాయం లభిస్తుంది. ఈ పథకానికి నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులో ఉంచింది — https://apnrts.ap.gov.in/insurance.
అదనంగా, ప్రజలు పథకం వివరాలు తెలుసుకోవడానికి 24/7 హెల్ప్‌లైన్ నంబర్ (91 863 2340678) మరియు వాట్సాప్ నంబర్ (91 85000 27678) ద్వారా సంప్రదించవచ్చు. ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా పథకాలలో మార్పులు చేయడానికి సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు.
ఈ పథకం ప్రవాసాంధ్రులకు గొప్ప భరోసాగా నిలుస్తుందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రులు తమకు ప్రభుత్వం అండగా ఉందన్న నమ్మకం కలుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఈ పథకం ద్వారా ప్రవాసాంధ్రుల సంక్షేమం దిశగా మరో ముఖ్యమైన అడుగు వేసిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.