దేశంలో అత్యధిక ఖనిజ సంపద (Mineral Wealth) కలిగిన రాష్ట్రాల్లో రాజస్థాన్ (Rajasthan) ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు ఈ రాష్ట్రం బంగారు నిల్వల (Gold Reserves) విషయంలో మరోసారి వార్తల్లో నిలిచింది. రాజస్థాన్‌లోని గిరిజన ప్రాంతమైన బన్స్‌వారా జిల్లాలో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.
ఈ ఆవిష్కరణతో బన్స్‌వారా జిల్లా భవిష్యత్తులో దేశానికి ఒక కొత్త స్వర్ణ రాజధానిగా మారే అవకాశం ఉంది. ఈ నిల్వలను జిల్లాలోని ఘటోల్ తెహసీల్ (Ghatol Tehsil) పరిధిలోని కంకారియా గ్రామంలో (Kankariya Village) గుర్తించారు. ఇప్పటికే ఇక్కడ ఉన్న భుకియా, జగ్‌పురా గనుల (Bhukia, Jagpura Mines) తర్వాత ఇది మూడో అతిపెద్ద బంగారు గనిగా నిలవనుంది.
భూగర్భ శాస్త్రవేత్తలు జరిపిన సర్వేల ప్రకారం, కనుగొన్న బంగారు నిక్షేపాల విస్తీర్ణం మరియు నాణ్యత ఆశ్చర్యకరంగా ఉన్నాయి. కంకారియా ప్రాంతంలో దాదాపు 3 కిలోమీటర్ల మేర బంగారు ఖనిజం విస్తరించి ఉన్నట్లు బలమైన ఆధారాలు (Strong evidence) లభించాయి.
ఈ ప్రాంతంలో మొత్తం 940.26 హెక్టార్ల విస్తీర్ణంలో 113.52 మిలియన్ టన్నుల బంగారు ఖనిజం ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా (Initially Estimated) వేస్తున్నారు.
ఈ ఖనిజాన్ని శుద్ధి చేసిన తర్వాత సుమారు 222.39 టన్నుల స్వచ్ఛమైన బంగారం (Pure Gold) లభించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాజస్థాన్‌లో ఇప్పటివరకు వెలుగుచూసిన అతిపెద్ద బంగారు నిల్వల్లో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం.
కంకారియా ప్రాంతం కేవలం బంగారానికి మాత్రమే పరిమితం కాదని, ఇక్కడ బహుళ విలువైన ఖనిజాలు (Multi-valuable minerals) ఉండే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కంకారియా-గారా ప్రాంతంలో బంగారంతో పాటు రాగి (Copper), నికెల్ (Nickel), కోబాల్ట్ వంటి ఇతర విలువైన ఖనిజాలు (Other valuable minerals) కూడా లభించే అవకాశం ఉంది. ఈ ఖనిజాలు ఎలక్ట్రానిక్స్ మరియు బ్యాటరీ రంగాల్లో చాలా ముఖ్యమైనవి.
అన్ని అనుమతులు లభించి, మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభమైతే, భారతదేశంలో బంగారం తవ్వకాలు జరిపే అతికొద్ది రాష్ట్రాల జాబితాలో రాజస్థాన్ కూడా చేరుతుంది. భవిష్యత్తులో దేశం మొత్తం బంగారం డిమాండ్‌లో 25 శాతం వరకు ఒక్క బన్స్‌వారా జిల్లా నుంచే సరఫరా చేసే సామర్థ్యం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
గతంలో భుకియా-జగ్‌పురా మైనింగ్ బ్లాక్‌ల కోసం ప్రభుత్వం నిర్వహించిన వేలంలో గెలిచిన సంస్థ, అవసరమైన హామీ మొత్తాన్ని జమ చేయడంలో విఫలమైంది. దీంతో ప్రభుత్వం ఆ లైసెన్స్‌ను రద్దు చేసింది. ప్రస్తుతం ఈ బ్లాక్‌ల కోసం మళ్లీ టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా, నవంబర్ 3న బిడ్లను తెరవనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక రెవెన్యూ వాటాను చెల్లించే సంస్థకు మైనింగ్ లైసెన్సును కేటాయించనున్నారు. ఈ ఆవిష్కరణ రాజస్థాన్ రాష్ట్రానికే కాక, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఒక కీలకమైన మైలురాయిగా నిలవనుంది.