రిషికేశ్‌లో జరిగిన ఒక అద్భుత ఘట్టం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 83 ఏళ్ల బ్రిటిష్ మహిళ ఓలెనా బైకో, అక్టోబర్ 13న శివపురి బంజీ జంపింగ్ సెంటర్‌లో 117 మీటర్ల ఎత్తు నుండి బంజీ జంప్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ వయస్సులో కూడా ఆమె చూపిన ధైర్యం, ఉత్సాహం అందరికీ స్ఫూర్తిగా మారింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతూ, వేలాది మంది ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. చాలామంది “ఇది నిజమైన సాహసానికి ప్రతీక”, “వయస్సు అనేది కేవలం సంఖ్య మాత్రమే” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
వీడియోలో ఓలెనా పూర్తిగా ప్రశాంతంగా, ఆనందంగా నృత్యం చేస్తూ జంప్‌కు సిద్ధమవుతున్న దృశ్యం కనిపిస్తుంది. ఆమె ముఖంలో భయం లేదా ఆందోళన ఏమీ లేకుండా, జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించే ఉత్సాహం మాత్రమే కనిపిస్తోంది. రిషికేశ్‌లోని శివపురి బంజీ జంపింగ్ సెంటర్ సాహసప్రియుల మధ్య ప్రసిద్ధి గాంచిన ప్రదేశం. కానీ ఓలెనా చేసిన ఈ అద్భుత జంప్ ఆ ప్రదేశానికి మరింత ప్రత్యేకతను తెచ్చింది.
సోషల్ మీడియాలో ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ ఎన్నో కామెంట్స్ వచ్చాయి. ఒకరు, “ఆమె కెమెరా వైపు కూడా చూడలేదు, తన ప్రపంచంలోనే ఆనందంగా ఉంది. మనమూ అలాగే జీవించాలి” అన్నారు. మరో యూజర్, “ఆమె చేతులను ఊపుతూ, ఆకాశంలో బాలెరినా లా నాట్యం చేస్తున్నట్లు ఉంది” అని వ్యాఖ్యానించాడు. ఇంకొకరు, “ఈ వీడియో చూసి నాకు చాలా సంతోషం కలిగింది. ఆమె జీవితంలోని ప్రతి కోరికను నెరవేర్చినట్టుంది. నిజంగా అద్భుతం!” అని పేర్కొన్నారు.
మరొక యూజర్ సరదాగా, “నేను ఎప్పుడూ పెద్దవారికి చెప్పేది. ఇదే సాహసాలు వయస్సు, కోల్పోవడానికి ఏమీలేదు!” అంటూ రాశారు. ఓలెనా బైకో చేసిన ఈ బంజీ జంప్, జీవితాన్ని ఆనందంగా గడపాలనే సందేశాన్ని అందిస్తోంది. ఆనందంగా ఉండడానికి వయస్సు ఎప్పుడూ అడ్డంకి కాదని, మనసులో ఉత్సాహం ఉంటే ఏదైనా సాధ్యమని ఆమె మరోసారి నిరూపించారు.