టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు ఢిల్లీ హైకోర్టులో భారీగా ఊరట లభించింది. ఇటీవల ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలు, వ్యక్తిగత లక్షణాలను వాడుతున్న 10 వెబ్‌సైట్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నాగార్జున ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో గతంలో హీరోయిన్ ఐశ్వర్యరాయ్‌కు లభించినట్లే ఇప్పుడు నాగార్జునకూ న్యాయపరమైన రక్షణ లభించింది.
నాగార్జున తన వ్యక్తిగత హక్కులు, నైతిక హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన అనుమతి లేకుండా ఏ వెబ్‌సైట్ లేదా సంస్థ ఆయన ఫోటో, పేరు, ఇతర వివరాలు వాడకూడదని శాశ్వతంగా నియంత్రణలు విధించాలని కోరారు. విచారణ అనంతరం హైకోర్టు ఆయన వాదనలతో ఏకీభవిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
కోర్టు స్పష్టంగా పేర్కొన్నది ఏమిటంటే నాగార్జున ఒక ప్రసిద్ధ వ్యక్తి కావడంతో ఆయనను తప్పుదారి పట్టించే లేదా అవమానకరమైన రూపంలో చూపడం వల్ల ఆయన గౌరవానికి తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అశ్లీల కంటెంట్‌తో ఆయన పేరును అనుసంధానించడం పూర్తిగా తప్పని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సంబంధిత 10 వెబ్‌సైట్లకు నోటీసులు జారీ చేసి, 72 గంటల్లోపు ఆయనకు సంబంధించిన అన్ని యూఆర్ఎల్‌లను తొలగించాలని ఆదేశించింది.
అలాగే ఈ ఆదేశాలను అమలు చేయడంలో కేంద్రం చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. నాగార్జున వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించే విధంగా ఎవరూ ప్రవర్తించకూడదని హెచ్చరిక జారీ చేసింది. దీంతో ప్రస్తుతం నాగార్జునకు న్యాయ పరంగా ఒక పెద్ద ఉపశమనం లభించింది. ఈ తీర్పు భవిష్యత్తులో ఇతర సినీ ప్రముఖులకు కూడా ఒక రకమైన రక్షణాత్మక నిదర్శనంగా మారనుంది అనే చెప్పుకోవచ్చు.