ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో రక్షణ రంగానికి సంబంధించి కీలక ప్రయోగ పరీక్షను నిర్వహించారు. జిల్లాలోని ఓర్వకల్లు మండలం, పాలకొలను సమీపంలోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ (NOAR) కేంద్రంలో ఈ ప్రయోగం జరిగింది. ఈ సందర్భంగా డ్రోన్ సాయంతో దేశీయంగా అభివృద్ధి చేసిన క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. ఈ వివరాలను ఆయన తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో షేర్ చేయడంతో పాటు, ప్రయోగానికి సంబంధించిన ఫొటోను కూడా పంచుకున్నారు.
ఈ క్షిపణిని UAV-లాంచ్‌డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ (ULPGM)-V3గా పేర్కొంటున్నారు. దీనిని డీఆర్‌డీవో (DRDO) ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు. అలాగే, మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSMEs), స్టార్టప్‌ల భాగస్వామ్యంతో రూపొందించారని మంత్రి తెలిపారు. అత్యాధునిక, సంక్లిష్టమైన సాంకేతికతను అభివృద్ధి చేయగల సామర్థ్యం భారత్‌కు ఉందని ఈ ప్రయోగం మరోసారి రుజువు చేసిందన్నారు.
గతంలో కూడా అదే పరీక్ష కేంద్రంలో డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ వ్యవస్థలపై ప్రయోగాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. 2016–17లో స్థాపితమైన ఈ కేంద్రం దాదాపు 2,200 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇక్కడ జరుగుతున్న ఆధునిక ప్రయోగాల ద్వారా భారత్ డ్రోన్ ఆధారిత యుద్ధతంత్రంలో గణనీయ పురోగతిని సాధిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.