ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టు కోసం టెండర్లను పిలిచింది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ (AMRC) ఈ మేరకు టెండర్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొత్తం మూడు కారిడార్లలో 46.23 కిలోమీటర్ల మెట్రో నిర్మాణానికి రూ.11,498 కోట్ల అంచనా వ్యయంతో ఈ టెండర్లు పిలవబడ్డాయి.
ఇందులో తొలి కారిడార్ విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు 34 కి.మీ.గా ఉండగా, రెండో కారిడార్ గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్టాఫీస్ వరకు 5 కి.మీ., మూడో కారిడార్ తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేర్ వరకు 7 కి.మీ.గా నిర్ణయించారు. ఈ మూడు కారిడార్లలో మొత్తం 42 మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు AMRC తెలిపింది. నిర్మాణాన్ని మూడు సంవత్సరాల కాలపరిమితిలో పూర్తిచేయాలని టెండర్ షెడ్యూల్‌లో పేర్కొన్నారు.